TRS and BJP on Fertilizers issue: మొన్నటి వరకు ధాన్యం విషయంలో రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ పరస్పర విమర్శలు చేసుకున్న తెరాస, భాజపా... తాజాగా ఎరువుల అంశంలో మాటల వేడిని పెంచాయి. ఎరువుల ధరల పెంపును నిరసిస్తూ బుధవారం ప్రధానికి లేఖ రాసిన కేసీఆర్.. సాగురంగాన్ని కుదేలు చేసేలా కేంద్రం నిర్ణయాలున్నాయని ఆక్షేపించారు. సీఎం లేఖకు కొనసాగింపుగా మంత్రులు.. భాజపా విధానాల్ని ఎండగడుతున్నారు.
కేంద్రంపై ఎర్రబెల్లి ధ్వజం
కేంద్ర ప్రభుత్వం రైతులపై కక్ష కట్టి పాలిస్తోందని ధ్వజమెత్తిన ఎర్రబెల్లి... ఎరువుల ధరలు తగ్గించే వరకూ ఆందోళనలు కొనసాగుతాయన్నారు. ఎరువుల ధరల పెంపును సమర్థించుకునేలా భాజపా నేతలు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. వ్యవసాయంపై కేంద్రానికి ఎలాంటి ముందుచూపులేదన్న మరోమంత్రి శ్రీనివాస్‌గౌడ్.. మొన్నటివరకు పంటలు కొనబోమని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు పంటలే పండించవద్దని ఎరువుల ధరలు పెంచిందని మండిపడ్డారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే..
ప్రధానికి ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నరేంద్రమోదీకి సీఎం రాసిన బహిరంగ లేఖ.. యావత్తు పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్... ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగుల పక్షాన తాము చేస్తున్న పోరాటం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం బహిరంగ లేఖ పేరిట కొత్త డ్రామాకు తెరదీసినట్లు కన్పిస్తోందన్నారు. ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకోవాల్సిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు...నేడు కన్నీళ్లతో సకినాల పిండిని తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.
2017 ఏప్రిల్ 13న ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతులకు ఉచితంగా ఎరువులను సరఫరా చేయాలని... ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. హామీలను, డిమాండ్లన్నింటినీ వచ్చే ఉగాది నాటికి అమలు చేయాలని... లేని పక్షంలో రైతుల పక్షాన మరో మహోద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: