నగరవ్యాప్తంగా 800లకు పైగా శ్మశానవాటికలు ఉన్నాయి. పదిలోపు వాటికల్లోనే కొవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి. ‘‘అంబులెన్సుల్లో వస్తున్న శవాలను సిబ్బంది శ్మశానవాటికలకు చేర్చుతున్నారు. కొన్ని రోజులుగా ఒకేసారి 5-10 మృతదేహాలు వస్తున్నాయని, అన్నింటికీ ఒకేసారి చితి పేర్చి సామూహిక దహన సంస్కారాలు నిర్వహిస్తున్నామని కాటికాపరులు చెబుతున్నారు. చితాభస్మాన్ని సేకరించేలోపే అంబులెన్సులు కూత పెడుతున్నాయి. అదే సమయంలో వేచి చూస్తోన్న మృతుల కుటుంబాలకు అస్థికలు ఇవ్వాలి. ముందు కాల్చిన చితిని పక్కకు తొలగించాలి. మళ్లీ కట్టెలు పేర్చి దహన సంస్కారానికి ఏర్పాట్లు చేయాలి. గ్లౌజులు, బూట్లు లేవు. బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారి చేయాలని కోరుతున్నా జీహెచ్‌ఎంసీ స్పందించట్లేదు’’ అని సాహెబ్‌నగర్ శ్మశానవాటిక మేనేజర్ జగదీష్ పేర్కొన్నారు.
కాష్టం కాల్చాల్సిందే
శ్మశానవాటికల్లో కరోనా శవాలు కాల్చుతుండటంతో గ్రామస్థులు మమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నారు. కుటుంబ సభ్యులూ దూరం పెడుతున్నారు. పిల్లలను దగ్గరకు తీసుకోలేకపోతున్నాం. అనారోగ్యం అనిపించినా కాష్టం కాల్చేందుకే వెళ్తున్నామని బన్సీలాల్‌పేట శ్మశానవాటిక సిబ్బంది వాపోయారు.
అన్నం కోసం బయటకు వెళితే కొట్టారు
‘‘ఆదివారం సాయంత్రం ఒకేసారి 7 శవాలొచ్చాయి. నాలుగు కొవిడ్ మరణాలు. అంతిమ సంస్కారాలు నిర్వహించేసరికి రాత్రి 9 గంటలైంది. భోజనం కోసం నేను, మరో వ్యక్తి బయటికి వెళ్లాం. మల్లేపల్లి చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కర్ఫ్యూలో బయట ఎలా తిరుగుతారని కొట్టారు. మేము కాటికాపరులం, దహనాలు చేసి తిండి కోసం వచ్చామని చెప్పినా వినలేదని’’ మెహిదీపట్నం దేవునికుంట శ్మశానవాటికలో పనిచేసే హన్మంతు కన్నీటి పర్యంతమయ్యాడు.
ఈఎస్‌ఐ దహన వాటికలో ఒక్కరోజే 32 దహనాలు
కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో మృతి చెందుతున్న కొవిడ్ బాధితులను ఈఎస్‌ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికకు పెద్దసంఖ్యలో తరలించి దహనం చేస్తున్నారు. బుధవారం ఒక్క రోజే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి తీసుకొచ్చిన 32 కరోనా మృతదేహాలను ఇక్కడ దహనం చేశారు. ఏప్రిల్ 8 నుంచి ఈ శ్మశానవాటికకు నిత్యం 20 నుంచి 23 వరకు మృతదేహాలు వస్తున్నాయి. కలప కొరత ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: ఆస్పత్రుల్లో షరతులు.. ఎన్వోసీ ఇస్తేనే మృతదేహం అప్పగింత.!