అమ్మో! కళ్ల కింద నల్లటి వలయాలా? ఎలా తగ్గుతాయి? అని బాధపడకండి. కింద వివరించిన ఈ నియమాలన్నీ పాటించి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది.
చల్లటి టీ బ్యాగ్స్‌తో..
టీ బ్యాగ్స్ నల్లటి వలయాలను పోగొట్టడంలో బాగా సహాయపడతాయి. దీనికోసం పది నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన టీ బ్యాగ్స్‌ను కళ్లపై ఉంచుకుని 15 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.
టమాటతో..
![tricks for dark circles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10808198_b.jpg)
చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో టమాట ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే కంటి కింద వలయాలు తొలగించడంలోనూ దీని పాత్ర కీలకమే. అదెలాగంటే.. కొంచెం టమాటా రసంలో కాస్త నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా చేస్తే నల్లటి వలయాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. లేదా కేవలం నిమ్మరసాన్ని తీసుకుని రోజుకు రెండు సార్లు కళ్ల కింద అప్త్లె చేసినా ఫలితం ఉంటుంది.
ఉప్పు తక్కువగా..
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఆల్కహాల్.. వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది. దీనివల్ల కంటి కింద నల్లటి వలయాలు తగ్గడం మాత్రమే కాదు.. శరీరానికి విశ్రాంతి కూడా లభిస్తుంది.
కీరా లేదా ఆలుగడ్డ ముక్కలతో..
![tricks for dark circles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10808198_bl.jpg)
చల్లటి కీరా లేదా ఆలుగడ్డ ముక్కల్ని తీసుకుని కళ్లపై పదిహేను నుంచి ఇరవై నిమిషాలపాటు ఉంచాలి. ఇలా చేసిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసి క్రీం అప్త్లె చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఈ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఆలుగడ్డ పొట్టు, రసం కూడా ఈ నల్లటి వలయాలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
బాదం నూనెతో..
రోజూ రాత్రి పడుకునే ముందు కాస్త బాదం నూనెను తీసుకుని కళ్ల చుట్టూ అప్త్లె చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుతాయి. ఇదే పద్ధతి రోజ్ వాటర్‌తో చేసినా చక్కటి ఫలితం ఉంటుంది.
కంటిని నలపకూడదు..
కొంతమంది కళ్లను పదేపదే నలుపుతుంటారు. దీనివల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కంటిని నలపడం ద్వారా మనంతట మనమే ఈ సమస్యను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.
మరికొన్ని..
- పైనాపిల్ రసంలో కొద్దిగా పసుపు కలుపుకొని నల్లటి వలయాలున్న చోట అప్త్లె చేసుకోవాలి. ఇలా చేస్తే వారం రోజుల్లో మీకే తేడా తెలిసిపోతుంది.
- పుదీనా రసం.. ఇది అన్నింటి కన్నా వేగంగా పని చేస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిగా పుదీనా రసాన్ని కళ్లకింద రాసుకోవాలి. పొద్దున లేవగానే కడిగేసుకుంటే నల్లటి వలయాలు పోవడంతో పాటు కళ్ల అలసట కూడా మాయమవుతుంది.
- నారింజపండు రసంలో కొద్దిగా గ్లిజరిన్‌ను కలిపి కంటి చుట్టూ పూయండి. ఇది కేవలం కళ్లకే కాకుండా ముఖానికి మంచి ఫేస్ ప్యాక్‌లా కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల ముఖం లోపలి నుంచి కాంతివంతమవుతుంది.
- కాటన్ బాల్స్‌ను రోజ్ వాటర్‌లో ముంచి కంటి రెప్పలపై నెమ్మదిగా రాయండి. ఇలా చేస్తే వలయాలు పోవడమే కాక కంట్లోని వేడి కూడా తగ్గుతుంది.
- తాజా పండ్లు, మొలకెత్తిన గింజలు (స్ప్రౌట్స్) ఆహారంలో భాగం చేసుకోవాలి.
- విటమిన్ సి, డి, ఇ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
- కళ్ల కింద నల్లటి వలయాలు నిద్రలేమి కారణంగా ఎక్కువ వస్తాయి.. కాబట్టి రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి.
- రాత్రి పడుకునే ముందు మేకప్ తీసేసి పడుకుంటున్నామా లేదా అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఐ మేకప్ వేసుకున్నవారు పడుకునే ముందు మేకప్ తీసేయకుండా అలాగే పడుకుంటే నల్లటి వలయాల సమస్య మరింత ఎక్కువవుతుంది.
ఇదీ చదవండి: బావే నమ్మించి మోసం చేశాడు..!