ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ మసాబ్ట్యాంక్లో గిరిజన హస్తకళ, చిత్రలేఖన, మూలికలతో వైద్యం ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ఒకరోజు మాత్రమే నిర్వహించే ఉత్సవాలను కరోనా కారణంగా ఈ ఏడాది నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఆదివాసీల జీవన విధానంతో పాటు వారు వేసిన చిత్రాలు, పచ్చబొట్లు, వైద్యం తదితర అంశాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన గిరిజన కులాలైన.. గోండ్, కోయ, నాయక్‌పోడ్, లంబాడి, ఓజ, కోలామ్, ఎరుకల ఉత్పత్తులను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.
అడవి బిడ్డలు తయారు చేసిన ఉత్పత్తులను నేటి నగరవాసులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ సంచాకులు విట్టా సర్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఏ చిన్న రోగం వచ్చినా సహజ సిద్ధంగా లభించే ఆకులు, గింజలు, గింజలనుంచి తయారు చేసిన నూనె, రసాలతో వైద్యం చేసుకుంటారని ద్యావనపల్లి సత్యనారాయణ తెలిపారు.
కరోనా కారణంగా ఈ ప్రదర్శనను నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నాం. గిరిజనుల హస్తకళలు, చిత్రలేఖనలు మిగిలిన రోజుల్లో ప్రదర్శిస్తాం. దీని ద్వారా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ లభిస్తుంది. ఏదైనా జబ్బు చేస్తే ఆస్పత్రులకు వెళ్లే అవసరం లేకుండా అడవిలో దొరికే వనమూలికలతోనే వారు స్వయంగా వైద్యం చేసుకుంటున్నారు. -విట్టా సర్వేశ్వర్‌రెడ్డి, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ సంచాకులు
తాము తయారు చేసిన ఉత్పత్తులను నగరవాసులు తెలుసుకునే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రదర్శన ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం రావడంతో పాటు గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. ప్రతి సారి ఒకరోజు మాత్రమే నిర్వహించే వారని... ఈ ఏడాది నాలుగు రోజుల పాటు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పచ్చబొట్టు ద్వారా కీళ్ల నొప్పులు, నడము నొప్పులు, ఒళ్లు నొప్పులను తగ్గించే విధంగా పచ్చబొట్లు వేస్తామని గిరిజన మహిళలు వెల్లడించారు. వీటితో పాటు విభిన్న శైలి కనబడే విధంగా ఉండే పచ్చబొట్లను.. సహజసిద్ధంగా లభించే రంగులతో వేస్తామని పేర్కొన్నారు. అడవి ప్రాంతంలో ఉండటం వల్ల చిన్న చిన్న రోగాలకు పట్టణాలకు వచ్చే సమయం ఉండదని... అందుకే అక్కడే దొరికే వనమూలికలతో వైద్యం చేసుకుంటామని గిరిజనులు వివరించారు.
ఈ ప్రదర్శన ద్వారా మా ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం. మేం అన్ని రకాల రోగాలకు అడవుల్లో దొరికే మూలికలతోనే వైద్యం చేసుకుంటాం. శరీరంలో కలిగే వివిధ రకాల నొప్పులను పచ్చబొట్ల ద్వారా తగ్గిస్తాం. ఈ ప్రదర్శనలో మా జీవనశైలి చూపించడం సంతోషంగా ఉంది. -గిరిజనులు
ఇలాంటి ప్రదర్శన ద్వారా గిరిజనుల సంస్కృతీసంప్రదాయాలు నగరవాసులకు తెలియజేయడంతో పాటు వారి ఉత్పత్తులకు మంచి ప్రచారం లభిస్తుందని గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. కరోనా వంటి సమయంలో కూడ వారు వనమూలికతో వైద్యం చేసుకుంటూ నయం చేసుకుంటున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: krmb, grmb: 'బోర్డుల సమావేశం వాయిదా వేయలేం'.. మరి తెలంగాణ హాజరవుతుందా?