ఆర్టీసీ లెక్కల ప్రకారం నగరంలో రోజూ సిటీ బస్సుల్లో 33 లక్షల మంది, ఎంఎంటీఎస్ రైళ్లలో 1.80 లక్షల మంది ప్రయాణించేవారు. వీరిలో అధికులు ఇంటి అద్దెలు తక్కువుంటాయని శివార్లలో నివసిస్తుంటారు. ఇలాంటి వారు పాసింజర్ రైళ్లను అందుకొని కనీస టిక్కెట్ రూ.10తో నగరానికి చేరుకుంటారు. సామాన్యుడి ప్రయాణ వనరులు కరవై ఉద్యోగాలను వదులుకోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు.
ఉద్యోగాలు కోల్పోతున్నారు..
బాలానగర్, కూకట్‌పల్లి, ప్రశాంత్‌నగర్, మూసాపేట, పటాన్‌చెరు ప్రాంతాల్లో 40 వేల వరకూ విస్తరించిన పరిశ్రమల యూనిట్లలో పని చేసే లక్షలాది మంది కార్యక్షేత్రానికి చేరుకోలేక ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. పాతబస్తీ, సికింద్రాబాద్, ఫతేనగర్, సనత్‌నగర్, భరత్‌నగర్, బోరబండ ప్రాంతాల నుంచి అనేకమంది మహిళలు ఇళ్లల్లో పనులు చేసేందుకు ఎంఎంటీఎస్‌లలో రూ.5 టిక్కెట్‌తో మాదాపూర్, కొండాపూర్, కేపీహెచ్‌బీ కాలనీలకు తరలి వచ్చేవారు. ప్రయాణ భారంతో వీరంతా ఇప్పుడు కాలు కదపలేని పరిస్థితి.
సడలింపులతోనైనా ప్రజారవాణా..
ప్రజారవాణాను పాక్షికంగా అయినా తెరవాలని నగరంలో ప్రైవేటు కార్యాలయాల్లో పని చేసేవారు కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం 31 బస్సులు ప్రత్యేకంగా వేశారు. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది కోసం 60 నుంచి 70 బస్సులు నడుస్తున్నాయి. ముఖ్యమైన మార్గాల్లో రద్దీని నియంత్రించే చర్యలు తీసుకుంటూనే ప్రజారవాణాను అందుబాటులోకి తీసుకువస్తే.. ఉద్యోగాలు, ఉపాధిని కాపాడుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు.
నిబంధనల పేరిట నిలువుదోపిడీ..
ఇక ఆటోల్లో వెళ్దామా అంటే నిబంధనల పేరిట నిలువుదోపిడీ చేస్తున్నారు. డ్రైవర్‌తో కలిపి ముగ్గురే ప్రయాణించాలనే నిబంధనతో 5 కిలోమీటర్ల దూరానికి రూ. 50లు, పది కిలోమీటర్లకు రూ. వంద వరకూ తీసుకుంటున్నారు. క్యాబ్‌లు సామాన్యులు ఎక్కలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో చాలా మంది ఉద్యోగాలను వదులుకుంటున్నారు.