భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరాలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా, అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్‌కో-జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అధికారులకు పలు సూచనలు చేశారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేయాలని ప్రభాకర్‌రావు అధికారులకు సూచించారు. నీట మునిగిన ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపి వేయాలని, ముంపు తొలగిన వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం..
కరీంనగర్ జిల్లాలో 220 కె.వి. సామర్థ్యం కలిగిన 7 టవర్లు భారీ వరదల వల్ల కొట్టుకుపోయాయని, వరంగల్ జిల్లాలో 2 చోట్ల 33 కె.వి. సబ్స్టేషన్లు నీట మునిగాయని అధికారులు ప్రభాకర్‌రావుకు వివరించారు. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు.
1200 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి..
ఎన్పీడీసీఎల్ పరిధిలో 54 గ్రామాలు నీట మునగటం వల్ల ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశామని సీఎండీ దృష్టికి తీసుకొచ్చారు. వరద నీరు నిండిన ప్రాంతాలకు సంబంధించి ఎస్పీడీసీఎల్ పరిధిలో 159, ఎన్పీడీసీఎల్ పరిధిలో 89 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ సరఫరాను ముందు జాగ్రత్త చర్యగా నిలిపి వేశామన్నారు. ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు ఉన్నందున అప్పర్ జూరాల, లోయర్ జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో మొత్తం 1200 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లు ఆయనకు వివరించారు.
ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గినందున కేటీపీపీ, సింగరేణి, కేటీపీఎస్ తదితర ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించామని సీఎండీ ప్రభాకర్‌రావు ప్రకటించారు. రోడ్లపై, భవనాలపై తెగి పడ్డ తీగల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సంబంధిత ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే 1912/100/ స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఎస్పీడీసీఎల్ పరిధిలో 7382072104, 7382072106, 7382071574 నంబర్లకు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 9440811244, 9440811245 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఇదీచూడండి: వరదలో చిక్కుకున్న కూలీలు.. రెస్క్యూ టీమ్ పంపిన ఎమ్మెల్యే