Autos crowd in hyderabad: హైదరాబాద్‌లో రోజురోజుకూ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగరంలో పెరిగిపోతున్న ఆటోలు కూడా ఇందుకు ఓ కారణమని ట్రాఫిక్ పోలీసులు తమ అధ్యయనంలో గుర్తించారు. నగరంలో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు మాత్రమే... హైదరాబాద్‌లో తిరగాలి. ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలకు నగరంలో అనుమతి లేదు. ఈ నిబంధన ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ పర్యవేక్షణ లేకపోవడంతో ఇతర ప్రాంతాల ఆటోలు కూడా నగర రహదారులపై రాకపోకలు సాగిస్తున్నాయి.
ఆ ఆటోలకు మాత్రమే అనుమతి
అధికారిక లెక్కల ప్రకారం నగరంలో సుమారు 1.5 లక్షల ఆటోలు ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో 3 నుంచి 4 లక్షల వరకు ఆటోలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. బయటి ప్రాంతాల నుంచి వస్తున్న ఆటోలను కట్టడి చేయాలని పలు సంఘాలు పోలీసు అధికారులకు వినతి పత్రాలు అందజేశాయి. సమస్యను పరిష్కరించాలని భావించిన పోలీసులు.. ఆటో డ్రైవర్లకు ఈ అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లో టీఎస్, ఏపీ 09, 13 వరకూ రిజిస్ట్రేషన్ ఉన్న ఆటోలను మాత్రమే అనుమతిస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అనుమతి లేని ఆటోలు నగరంలోకి ప్రవేశిస్తే సీజ్ చేసి రవాణ శాఖకు అప్పగించాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: Revanth Reddy on JaggaReddy: జగ్గారెడ్డి కామెంట్స్‌పై రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇది!