గతంలో ఎన్నడూ లేనంతగా నిన్న అతి భారీ వర్షాలు పడడం వల్ల హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. మూసీ నదితోపాటు, పలు చోట్ల నాలాలు పొంగి పొర్లుతున్నాయి. నగరంలో చోటుచేసుకున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలు చోట్ల వాహనాలను దారి మల్లించగా.. మరికొన్ని ప్రాంతాల్లో వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. విజయవాడ జాతీయ రహదారిపై దిల్‌సుఖ్‌నగర్-చైతన్యపురి మధ్య మోకాలిలోతు నీరు ప్రవహిస్తుండటంతో పూర్తిగా వాహన రాకపోకలను నిలిపివేశారు.
పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ మూసివేత
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని నగరవాసులకు సూచిస్తున్నారు. తమ సూచనలను పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆరంఘర్ చౌరస్తా దాటి హైదరాబాద్-కర్నూల్ జాతీయ రహదారి-44 పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. నీరు తగ్గే వరకు ఆ మార్గంలో వాహనరాకపోకలు కొనసాగవని పోలీసులు స్పష్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయం, జాతీయ రహదారి-44లోని కర్నూల్ నుంచి సాద్‌నగర్ వైపు వెళ్లే వాహనాలు బాహ్య వలయ రహదారిని ఎంచుకోవాలని, పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని ఉపయోగించకూడదని స్పష్టం చేశారు.
టోలిచౌకి ఫ్లైఓవర్ కాకుండా సవెన్ టోంబ్స్ రహదారి
మెహదీపట్నం నుంచి గచిబౌలి వైపు వెళ్లాలనుకునే వాహనదారులు టోలిచౌకి ఫ్లైఓవర్ కాకుండా సవెన్ టోంబ్స్ రహదారిని ఎంచుకోవాలని సూచించారు. గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలు మెహదీపట్నం, షేక్‌పేట్, సెనార్ వ్యాలీ, ఫిల్మ్‌నగర్, బీవీబీ జంక్షన్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ద్వారా వెళ్లాలని పేర్కొన్నారు. మూసీ నది నుంచి వరద నీరు అధికంగా ప్రవహించడం వల్ల పురాణపూల్ వద్ద 100 అడుగుల రహదారి పూర్తిగా మూసివేసిన పోలీసులు.. ఈ దారిన వెళ్లాల్సిన వాహనదారులను కార్వాన్ వైపు దారిమళ్లించినట్లు వివరించారు. మలక్‌పేట రబ్ పూర్తిగా మూసివేసి చాదర్‌ఘాట్ నుంచి వచ్చే వాహనాలు.. నింబోలిఅడ్డా, గోల్నాకా, అంబర్‌పేట, రామంతపూర్, ఉప్పల్ వైపు మళ్లించినట్లు తెలిపారు.
మూసారంబాగ్ ఆర్‌టీఏ ఆఫీస్ వంతెన మూసివేత
మూసీనది పొంగి ప్రవహిస్తున్నందున అలీ కేఫ్, అంబర్‌పేట్ రహదారి మధ్య మూసారంబాగ్ ఆర్‌టీఏ ఆఫీస్ వంతెన పూర్తిగా మూసివేసినట్లు వివరించారు. ఈ మార్గంలో వెళ్లాల్సిన ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. మలక్‌పేట రబ్ వద్ద నాలా పొంగిపొర్లుతుండడం వల్ల మలక్‌పేట్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే రహదారి పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. ఈ దారిన వెళ్లాల్సిన వాహనదారులు మలక్‌పేట చర్మాస్ వద్ద నుంచి అక్బర్‌బాగ్, ఫైర్ స్టేషన్, చెంచల్‌గూడ ఎంబీఎన్‌ఆర్ ఎక్స్ రోడ్డు వైపు వెళ్లాలన్నారు. భారీ వర్షపు నీటి కారణంగా ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జిని పూర్తిగా మూసివేసిన పోలీసులు.. ఆ రహదారిపై వెళ్లాల్సిన ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: శాసనమండలి నిరవధిక వాయిదా