Congress Protests at Gun Park: నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజనీకుమార్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. కానీ ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారని అయన మండిపడ్డారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్‌పార్కు వద్ద ఆందోళన చేపట్టారు. నిరుద్యోగ భృతి అమలు చేయాలని.. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చేంతవరకు పోరాడతామని అంజనీకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
"ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగ భృతి అమలు చేయకుండా.. నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేసీఆర్ నిరంకుశ పాలన చేస్తున్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. ఉద్యోగాలు వేసేవరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తూనే ఉంటాం." - అంజనీ కుమార్ యాదవ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
రాష్ట్రంలో ఉద్యోగాల కోసం 50లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులకు అమరవీరుల సాక్షిగా గన్‌పార్కు వద్ద ధర్నా చేపట్టి నివాళులర్పించామని శివసేనా రెడ్డి పేర్కొన్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
ఇదీ చదవండి: TRS MPs Boycotted President's Speech: రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన తెరాస ఎంపీలు