దళితుడిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి.. సీఎం కేసీఆర్ మాట తప్పారని.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ విమర్శించారు. పంజాబ్‌లో దళిత నేతను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసిందని తెలిపారు. రాజ్యసభ, తెలంగాణలోనూ దళిత నేతలను ప్రతిపక్షనేతలుగా నియమించామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ ఇందిరాభవన్‌లో జరిగిన టీపీసీసీ ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దళితుడు ప్రతిపక్ష నేతగా ఉంటే సహించలేని సీఎం కేసీఆర్... కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మండిపడ్డారు. దళితులమీద ప్రేమ ఉంటే మున్సిపల్ శాఖను వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రతి నెలా ఎస్సీ సెల్ సమావేశాలు
పార్టీ నిర్మాణం కోసం అందరూ పాటుపడాలని ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు తెలిపారు. కిసాన్ సెల్‌తోపాటు ఎస్సీ సెల్ సమావేశాలను ప్రతి నెల నిర్వహించాలని బోసురాజు సూచించారు. ప్రతివారం రెండు గ్రామాలను ఎంచుకుని దళిత వాడల్లో పర్యటిస్తానని ఎస్సీ సెల్ కమిటీ ఛైర్మన్ ప్రితం వెల్లడించారు. అక్టోబర్ 9 నుంచి 3నెలల పాటు పర్యటన ఉంటుందని ప్రీతం వివరించారు.
కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ: రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (t pcc president revanth reddy) అన్నారు. ఇతర పార్టీల్లో దళిత విభాగం ఆరో వేలుగా ఉంటుందని విమర్శించారు. పంజాబ్‌లో దళితుడిని సీఎం చేసిన ఘటన కాంగ్రెస్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. తెలంగాణలోనూ శాసనసభపక్ష నేతగా దళిత నాయకుడు భట్టికి అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఏపీలోనూ దళిత నాయకుడు శైలజానాథ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించినట్లు పేర్కొన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలను కాంగ్రెస్ ఏనాడు నిర్లక్ష్యం చేయలేదని రేవంత్ తెలిపారు.
కేసీఆర్ పాలనలో పేదలకు చదువు దూరం
కాంగ్రెస్ పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ అమ్ముతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సంస్థలను ప్రైవేటుపరం చేయడం వల్ల ఆయా సంస్థల్లో రిజర్వేషన్లను అమలుచేసే అవకాశం లేకుండా పోతుందని రేవంత్ అన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. మంత్రి మల్లారెడ్డికి, పల్లాకు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చి రిజర్వేషన్లు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో పేదలకు చదువు దూరం అయిందని... కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ విధానాలు ప్రమాదకరంగా మారాయని రేవంత్ దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: REVANTH REDDY:'శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్ ఉద్యమిస్తుంది'