Revanth Reddy complaint on Assam CM: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై క్రిమినల్ కేసు నమోదు చేసి... ఆయనను పదవి నుంచి తొలగించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై అసోం సీఎం వ్యాఖ్యలు.. సోనియా గాంధీకి జరిగిన అవమానం మాత్రమే కాదని.. దేశంలోని మాతృమూర్తులకు జరిగిన అవమానమని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌తో కలిసి రేవంత్ ఫిర్యాదు చేశారు. మరోవైపు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి.. నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అసో సీఎంకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పీఎస్‌లలో ఫిర్యాదులు చేయాలని కాంగ్రెస్ నేతలకు రేవంత్ పిలుపునిచ్చారు.
ప్రత్యేక బృందాన్ని పంపించాలి
తెలంగాణ ఇచ్చిన సోనియాకే ఘోర అవమానం జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. అసోం సీఎం వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండిస్తే సరిపోదని.. తగిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసు శాఖ నుంచి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అరెస్టు చేయించాలని స్పష్టం చేశారు. 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే.. ఈ నెల 16న అన్ని పోలీస్స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
"అసోం సీఎంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలి. అసోం సీఎం వ్యాఖ్యలను కేసీఆర్ ఖండించడం నిజమే అయితే.. రాష్ట్ర పోలీసు శాఖ నుంచి ప్రత్యేక బృందాన్ని పంపించి అరెస్టుకు ఆదేశించాలి. 48 గంటల్లో స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీఎస్‌ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతాం." - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
క్షమాపణ చెప్పాలి
దేశ సంస్కృతిపై గౌవరం ఉంటే అసోం ముఖ్యమంత్రిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వినోద్ రెడ్డి డిమాండ్ చేశారు. భాజపా అగ్రనాయకత్వం వెంటనే జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కమలం పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి: CM KCR Comments: కేంద్రాన్ని జైలుకు పంపేది మాత్రం పక్కా: సీఎం కేసీఆర్