పోతిరెడ్డిపాడు విస్తరణ ఆగే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ ఛైర్మన్ నాగం జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తమ్‌తో పాటు కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మాజీ మంత్రి ప్రసాద్, మాజీ ఎంపీ మల్లు రవి, పలువురు డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు.
తెలంగాణ పోరాటంలో సాగునీరు ప్రధాన అంశమని ఉత్తమ్ గుర్తు చేశారు. ఏపీ సీఎం జగన్, కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జగన్ 6 నెలల కిందనే పోతిరెడ్డి పాడు విస్తరణ గురించి మాట్లాడినా అడ్డుకోలేదన్నారు. నేడు జీఓలు ఇచ్చి పనులు ప్రారంభిస్తున్నా... కేసీఆర్ ఎలాంటి అడ్డుచెప్పడం లేదన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ జరిగితే నాగార్జున సాగర్ ఎండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల