జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం కేసీఆర్(KCR)... దేశం నుంచి నరేంద్రమోదీకి(PM MODI) వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(REVANTH REDDY) అన్నారు. కేసీఆర్, మోదీ పెట్టుబడిదారీ అనుకూల విధానాలు అనుసరిస్తూ ప్రజలకు నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీభవన్‌లో జరిగిన క్విట్ ఇండియా(quit india movement) వేడుకల్లో పాల్గొన్న రేవంత్... రాష్ట్రంలో తెరాస(TRS) పాలనలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. కాంగ్రెస్(CONGRESS) పాలనలోనే అన్నివర్గాలకు సమన్యాయం జరుగుతుందని రేవంత్ గుర్తుచేశారు. ఆ తర్వాత గాంధీభవన్ నుంచి ఇంద్రవెల్లిలో జరగనున్న దళిత, గిరిజన దండోరా సభలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
అందుకే ప్రత్యేక రాష్ట్రం
కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి స్వేచ్ఛ వాయువులని ఇచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశం ప్రపంచ దేశాల ముందు ఒక శక్తివంతమైన దేశంగా నిలబడిందని అన్నారు. కానీ నరేంద్ర మోదీ పాలనలో దేశాన్ని ఆదానీ, అంబానీలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ సామాన్యులపై భారం వేశారన్నారు. ఈ విధానాలను వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతోనే తెలంగాణ ఏర్పడిందన్న రేవంత్... రాజకీయంగా కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసినా యువకుల ఆత్మబలిదానాలకు చలించిపోయి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు.
ప్రత్యేక తెలంగాణ ఇచ్చే ముందు సోనియా గాంధీ ఆకాంక్షించిన ఆశయాలు ఇప్పటికీ నెరవేరలేదు. ఎన్నికల సమయంలో జీడీపీని పెంచుతామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆయన ఉద్దేశంలో జీ అంటే గ్యాస్, డీ అంటే డీజిల్, పీ అంటే పెట్రోల్ ధరలను పెంచడం. తెల్ల దొరల ఫాసిస్ట్ విధానాలను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఈ ఇద్దరికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో యువత భాగస్వామ్యం కావాలి. తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం రావాలి. అప్పుడే అందరికీ స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన అమలు జరుగుతుంది.
-రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇదీ చదవండి: జాతీయోద్యమంలో ఆఖరి సమ్మెట క్విట్ ఇండియా