సర్పంచుల సమస్యలు తీరాలంటే కేసీఆర్ పోవాలని.. బీఆర్ఎస్ను బొంద పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబాన్ని పొలిమేరలు దాటే వరకు తరమాలన్నారు. పంచాయతీ విధులు, నిధులు సమస్యలపై ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఖరితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరిది పుస్తెలు అమ్ముకున్న పరిస్థితి అని ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచుల నిరసనకు సంఘీభావంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుందని ఆరోపించారు. అయినా హైకోర్టు అనుమతితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించిందని తెలిపారు. ఈ ధర్నాకు ఎంతోమంది సర్పంచులు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారన్నారు.
గ్రామం గౌరవం పెరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు గౌరవం ఇవ్వాలని, వారికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. సర్పంచుల ఆత్మ గౌరవం దెబ్బతీసి వారిని ఆత్మహత్యలకు ఉసి గొల్పింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికే ఆ నిధులను దారి మళ్లించారని రేవంత్ ఆరోపించారు. చెట్టు చనిపోతే సర్పంచ్‌ను సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారని.. మరి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను ఏం చేయాలని నిలదీశారు. కేటీఆర్ నిర్లక్ష్యంతో మూసీలో మునిగి 30 మంది చనిపోయారని ఆరోపించారు.
బీఆర్ఎస్ అంటే భారత్ రాష్ట్ర సమితి కాదని.. భస్మాసుర సమితి అని రేవంత్ ఆరోపించారు. బుద్ధి మార్చుకోకపోతే ఈ భస్మాసుర సమితి కూడా కేసీఆర్‌ను కాపాడలేదని హెచ్చరించారు. పనికి మాలిన చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తామని ప్రకటించారు. సర్పంచుల నిధులు ఎవరూ దొంగిలించకుండా పటిష్ట చట్టం తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరణించిన ప్రతి సర్పంచ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సర్పంచుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. సర్పంచుల ఖాతాల్లో పడాల్సిన నిధులను రాష్ట్రప్రభుత్వం దొంగిలిస్తోంది. రూ.35 వేల కోట్ల సర్పంచుల నిధులను దారి మళ్లించింది. ఆస్తులు అమ్మి, అప్పులు చేసి సర్పంచులు గ్రామాల్లో పనులు చేశారు. ఇప్పటికే కొందరు సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామాల్లో చెట్లు చనిపోతే సర్పంచులను సస్పెండ్ చేస్తున్నారు. పట్టణాల్లో డ్రైనేజీ లోపాల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. మరి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఈ క్రమంలోనే హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో జీహెచ్‌ఎంసీకి బ్యాంకుల్లో రూ.600 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉండేవన్నారు. కేసీఆర్ పాలనలో జీహెచ్‌ఎంసీకి అప్పు కూడా పుట్టని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తెలంగాణ పేరుతో ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేమని గ్రహించిన కేసీఆర్.. బీఆర్ఎస్ పేరుతో తిరుగుతున్నారని దుయ్యబట్టారు.
నిధులు ఉన్నట్లు చూపిస్తూనే కాజేశారు..: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉన్న నిధులను ట్రెజరీకి చూపించి రుణాలు పొందే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని దుయ్యబట్టారు. సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధర్యంలో నిర్వహించిన ధర్నాకు షబ్బీర్ అలీ హాజరయ్యారు. గ్రామ పంచాయతీల ఖాతాలలో నిధులు ఉన్నట్లు చూపిస్తూనే.. డ్రా చేయడానికి వీలు లేకుండా కాజేశారని ఆయన మండిపడ్డారు.
హక్కులు సాధించే వరకు పోరాటం..: గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా.. ఊరిలో హరితహారం చెట్లు పెరగకున్నా.. నీళ్లు రాకున్నా సస్పెండ్ చేస్తామని కలెక్టర్లు బెదిరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు అండగా ఉంటుందన్నారు. హక్కులు సాధించేంత వరకు పోరాటం చేద్దామని సూచించారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ధర్నా కోసం కోర్టు అనుమతితో పాటు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నప్పటికీ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను, సర్పంచులను అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి..
రైతులకు శుభవార్త.. త్వరలోనే అందుబాటులోకి వన్ స్టాప్ షాప్ సేవలు
గుణశేఖర్ అలా అనేసరికి స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న సమంత