నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ (Sonia Gandhi) తెలంగాణ ఇచ్చారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా పట్ల కృతజ్ఞత చూపాలని పేర్కొన్నారు. తెలంగాణలోని 4 కోట్ల ప్రజల గుండెల్లో సోనియాగాంధీ ఉన్నారని రేవంత్ అన్నారు. రాహుల్‌గాంధీ వంటి నాయకుడు కాంగ్రెస్ సైన్యాన్ని నడిపిస్తారన్నారు. ప్రతి కార్యకర్త కుటుంబసభ్యులకు రెండేళ్లు సెలవు పెట్టాలన్న రేవంత్‌రెడ్డి... రాష్ట్రం, దేశం కోసం కార్యకర్తలు ఇంట్లో అనుమతి తీసుకోవాలని కోరారు.
కరోనా కంటే ప్రమాదకరం...
కరోనా కంటే సీఎం కేసీఆర్ (Cm kcr), ప్రధాని మోదీ (Pm Modi) ప్రమాదకరమని రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో స్వేచ్ఛ, స్వయం పాలన లేక పెద్దదిక్కు లేకుండా పోయిందని ఆరోపించారు. తెలంగాణ ద్రోహులు గద్దెనెక్కి ఇష్టారీతిన ఆడుతున్నారని విమర్శించారు. అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కేసీఆర్ వచ్చాక ఎన్‌కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదన్నారు. అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోలేదన్నారు. గులాబీ చీడను పొలిమేర్లు దాటేవరకు తరమాలన్న రేవంత్... ఉద్యమకారుడని చెప్పుకునే కేసీఆర్ తెలంగాణను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ చెరలో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని ఆరోపించారు.
మీరే ఏకే 47 తూటాలు...
పార్టీ సమష్టి పోరాటాలతో అధికారం చేజిక్కించుకోవాలని రేవంత్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. వ్యక్తిగత నినాదాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టమని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తల్లి విముక్తి కోసం కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలే ఏకే 47 తూటాలన్న రేవంత్... రాష్ట్రం సుభిక్షంగా మారాలంటే కార్యకర్తలు గ్రామగ్రామం తిరగాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఇంటింటా చెప్పాలన్నారు.
ఎవరెన్ని చెప్పినా... ఎవరు అడ్డంబడ్డా... 60 ఏళ్ల తెలంగాణ ప్రజల సాకారం చేసింది సోనియాగాంధీ. నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో సోనియమ్మ గుడి కట్టుకుని పూజించాల్సిన అవసరం ఉంది. నన్ను అధ్యక్షుడిగా నియమించినపుడు యువ మిత్రుడు దాసోజు శ్రవణ్ ట్విట్టర్లో ఒకమాట చెప్పిండు. వేలాది మంది మన వెనకాల ఉంటే... ఒక యుద్ధాన్ని గెలవొచ్చు. అదే వేలాది మంది సైనికులకు నాయకుడు ముందుండి నడిపిస్తే ఈ ప్రపంచాన్నే గెలవొచ్చని చెప్పిండు. ఇవాళ రాహుల్ గాంధీలాంటి నాయకుడు మన సైన్యాన్ని నడిపించడానికి ఉన్నడు. సోనియమ్మ తల్లి మనల్ని ఆశీర్వదించడానికి ఉన్నది. రాష్ట్రంలో, దేశంలో మోదీ, కేసీఆర్ వల్ల పేదవాడు బతికే పరిస్థితులు లేవు. కరోనా కంటే ప్రమాదకరం కేసీఆర్, నరేంద్ర మోదీలు. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీని 100 మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలంటే... ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రెండేళ్లు సెలవు పెట్టి కష్టపడితే రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.
-- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇదీ చూడండి: REVANTH REDDY: పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి