Revanth reddy allegations Budget : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో శ్రీమంతులకే ప్రయోజనం చేకూరుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆర్థిక పద్దుతో నిరుపేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. జీఎస్టీ సహా ఆదాయపన్ను రేట్లు, స్లాబులు మార్చకపోవడంతో సామాన్యులకు నిరాశే ఎదురైందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మంగళవారం నాడు చిత్రవిచిత్రంగా మాట్లాడారని అన్నారు. సీఎం కేసీఆర్ మాటలు బాధ్యతారహితంగా ఉన్నాయని... రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి కేసీఆర్ అడగలేదని వ్యాఖ్యానించారు.
కొత్త రాజ్యాంగం తేవాలనే కేసీఆర్ ప్రతిపాదన విచిత్రమన్న రేవంత్‌రెడ్డి... భూస్వాములు, పెట్టుబడిదారుల కోసం కొత్త రాజ్యాంగం కోరుతున్నారా.. అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భాజపా ఆలోచనలనే ఇక్కడ కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనేది భాజపా యోచన అన్న రేవంత్... రిజర్వేషన్లు రద్దు కోసం భాజపా కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోందని అన్నారు. భాజపా తన ఆలోచనను కేసీఆర్ ద్వారా ప్రతిపాదిస్తోందని ఆరోపించారు.
అంబేడ్కర్ రచించిన రాజ్యంగం రద్దు చేసి.. రాజులు, సామంతులు, భూస్వాములు, పెట్టుబడుదారులకు అనుకూలమైన రాజ్యంగాన్ని రచించాలనే భాజపా ఆలోచనను సీఎం కేసీఆర్ సమర్థించారు. అందుకే నిన్న ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు. భాజపా ఒత్తిడితోనే వాళ్ల ఆలోచనను ప్రతిపాదించినట్లు కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారు. అందుకు కేసీఆర్ మద్దతు పలుకుతున్నారు.
-రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
కేటీఆర్‌కు రేవంత్ లేఖ
'కల్వకుంట్ల వారి మాటలు కోటలు దాటుతాయ్ కానీ... పనులు గడప దాటవనే నానుడి మరోసారి రుజువైందని' రేవంత్ రెడ్డి ఆరోపించారు. తన పార్లమెంట్ పరిధిలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డుల నుంచి విషవాయువులు వెలువడి.. ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని మంత్రి కేటీఆర్‌కు ఆయన రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. జవహర్‌నగర్‌లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని కేటీఆర్‌కు జాయింట్ అక్షన్ కమిటీ అనేకసార్లు చెప్పిందని... నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ప్రభుత్వం ఇచ్చిన హామీ సైతం పక్కన పెట్టారని లేఖలో ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తరలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు.
ఇదీ చదవండి : Vinod Kumar allegations on BJP: ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే బడ్జెట్లో నిధులు: వినోద్‌కుమార్