టాలీవుడ్ మత్తు మందుల కేసులో సినీ నటి ఛార్మి గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యే అవకాశముంది. ఈ కేసులో తొలిరోజు మంగళవారం దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. మొత్తం 12 మంది సినీ ప్రముఖుల్ని విచారించేందుకు సమాయత్తమైన ఈడీ గురువారం హాజరు కావాలని ఛార్మికి ఇదివరకే సమన్లు జారీ చేసింది.
కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా..
డ్రగ్స్ కేసు విచారణలో కీలక సరఫరాదారు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. కెల్విన్ నుంచి బ్యాంకు లావాదేవీలను ఈడీ అధికారులు సేకరించారు. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మంగళవారం పూరి జగన్నాథ్‌ను 11 గంటలపాటు విచారించారు. అతడి నుంచి 3 బ్యాంకు ఖాతాల లావాదేవీల సమాచారం సేకరించారు. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పూరీని ప్రశ్నించిన అధికారులు.. అతనికి సంబంధించిన మూడేళ్ల లావాదేవీలు సేకరించారు. 2017నాటి బ్యాంకు లావాదేవీలపైనా దృష్టి సారించారు.
అనుమానాస్పద లావాదేవీల ఆధారంగా..
కెల్విన్, ఇద్దరు అనుచరుల ఫోన్లలో గతంలో లభించిన తారల వివరాల ఆధారంగానే నటులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. 8మంది సరఫరాదారుల బ్యాంకు ఖాతాలు సేకరించిన అధికారులు.. అనుమానాస్పద లావాదేవీల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.
2017లో నమోదైన కేసుల ఆధారంగా పలు కీలక విషయాలపై ఈడీ అధికారులు ఆయన్ను ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ ఎక్సైజ్ సిట్ విచారణకు భిన్నంగా కొనసాగనుంది. మనీలాండరింగ్ కోణంలోనే వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ సిట్ నుండి వివరాలు సేకరించిన ఈడీ.. సినీ రంగానికి చెందిన 12 మంది బ్యాంక్ ఖాతాలు పరిశీలించే అవకాశం ఉంది.
ఒకరి తర్వాత ఒకరు
ఈ వ్యవహారంలో 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్‌తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22వ తేదీ తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఎక్సైజ్ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినీ ప్రముఖులను ఎక్సైజ్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. అయితే, సినీ ప్రముఖులకు క్లీన్‌చీట్ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు.. పలువురు డ్రగ్స్ విక్రేతలపై 12 ఛార్జిషీట్లు దాఖలు చేశారు.
ఇదీ జరిగింది..
డ్రగ్స్ కేసును సీబీఐ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని గతంలో రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఈడీ.. కేసు విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎక్సైజ్ అధికారుల నుంచి వివరాలు అందడం లేదని ఈడీ ఆరోపించింది. చివరకు ఎక్సైజ్ శాఖ కేసుల ఆధారంగా డ్రగ్స్ కేసులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకావాలని పలువురు సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేసింది.
ఇదీ చదవండి: DRUGS CASE:డ్రగ్స్ కేసు మాటున సినీ ప్రముఖుల ఆర్థిక లావాదేవీలపై ఈడీ నజర్!