వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించనున్నారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మూడు జిల్లాల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్వర్ రెడ్డి, మల్లారెడ్డిలతో శనివారం తన నివాసంలో సమావేశమై చర్చించారు. రంగారెడ్డి నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వరంగల్ నుంచి శ్రీనివాస్ రెడ్డిని పోటీ చేయించాలని నిర్ణయించారు. నల్గొండ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు చర్చకు వచ్చినా ఆయన శాసనసభ్యుల కోటా స్థానం కావాలని కోరుతున్నట్లు సమాచారం. ప్రత్యామ్నాయంగా ఇతర నేతలు తేరా చిన్నప రెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, చకిలం అనిల్ కుమార్, సుంకరి మల్లేశ్ గౌడ్, వై.వెంకటేశ్వర్లలో ఒకరికి అవకాశం ఇవ్వాలని యోచించినట్లు తెలిసింది. ఈ రోజు నల్గొండపై తుది నిర్ణయం తీసుకొని, ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను కేటీఆర్కు అప్పగించారు.
ఇవీ చూడండి: అవసరమైన చర్యలు తీసుకోవాలి: హోంమంత్రి