తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌లో.. అధినేత చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించనున్నారు. 1982 మార్చి 29న స్వర్గీయ నందమూరి తారకరామారావు హైదరాబాద్ లోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లో 1983 జనవరిలో తొలి సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 294 స్థానాలకుగానూ 203 స్థానాలను దక్కించుకుని విజయపతాకాన్ని ఎగురవేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 60, ఇతరులకు 30 సీట్లు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లో తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీరామారావు చరిత్ర సృష్టించారు. నాటి నుంచి మొత్తం 9సార్వత్రిక ఎన్నికల్ని ఎదుర్కొన్న పార్టీ 5 పర్యాయాలు విజయం సాధించి 21 ఏళ్ళు అధికారంలో ఉంది.
1985లో 35 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుని పార్లమెంటులో ప్రతిపక్ష హోదాని సైతం తెలుగుదేశానికి దక్కించుకుంది. అనంతర కాలంలో జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టి నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1995 ఆగస్టులో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు అదే పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్రకు జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం తర్వాత 2109 సార్వత్రిక ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసింది. ఆవిర్భావం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ వచ్చిన పార్టీ తిరిగి పూర్వవైభవం కోసం కృషి చేస్తోంది. ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే వేడుకల్లో చంద్రబాబు తో పాటు ముఖ్యనేతలంతా పాల్గొననున్నారు.
తెదేపా ఆవిర్భావం నుంచి కీలక ఘట్టాలు....
- 1982 మార్చి 29: మధ్యాహ్నం 2.30 గంటలకు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్టు ఎన్టీఆర్ ప్రకటించారు.
- 1983 జనవరి 5: తెలుగుదేశం పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. మొత్తం 294 స్థానాలకుగానూ 203 స్థానాలను దక్కించుకుని విజయపతాకాన్ని ఎగురవేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు 60, ఇతరులకు 30 సీట్లు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లో తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీరామారావు చరిత్ర సృష్టించారు.
- 1984 ఆగస్టు 14: ఎన్టీఆర్‌పై మంత్రి నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేశారు. ఎన్టీఆర్ సర్కార్‌ను నాటి గవర్నర్ రామ్‌లాల్ రద్దు చేశారు. ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
- 1984 సెప్టెంబర్: జాతీయ స్థాయిలో ఎన్టీఆర్‌కు ప్రతిపక్షాల మద్దతు లభించింది. ప్రజాగ్రహాన్ని గుర్తించిన నాటి ఇందిర ప్రభుత్వం గవర్నర్ రామ్‌లాల్‌ను రీకాల్ చేసింది. ఆ స్థానంలో శంకర్‌దయాళ్ శర్మను నియమించింది. అసెంబ్లీలో బల నిరూపణకు ముందే నాదెండ్ల గద్దె దిగారు.
- 1984 సెప్టెంబర్ 20: ఎన్టీఆర్ అసెంబ్లీలో తన మెజారిటీని నిలబెట్టుకుని రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేశారు. ఇందిర హత్య తాలూకు సానుభూతి పవనాలను తట్టుకుని 202 అసెంబ్లీ స్థానాలను, 35 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోగలిగారు. పార్లమెంటులో ప్రతిపక్ష హోదా తెలుగుదేశానికి దక్కింది.
- 1985 మార్చి 9: ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతర కాలంలో జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టి నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
- 1989: ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో తెలుగుదేశం ఓటమి పాలైంది. రెండు స్థానాల్లో పోటీ చేసిన ఎన్టీఆర్ రెండవ నియోజకవర్గమైన కల్వకుర్తిలో చిత్తరంజన్‌దాస్ చేతిలో ఓటమి పాలయ్యారు.
- 1994: అసెంబ్లీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా 213 స్థానాలను దక్కించుకుని తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కేవలం 26 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.
- 1995 ఆగస్టు: తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు అధ్యక్షులయ్యారు.
- 1995 సెప్టెంబర్ 1: ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలను స్వీకరించారు.
- 1996 జనవరి 18: పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ మరణం.
- 1996: ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.
- 2004, 2009: రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ తెలుగుదేశం ఓటమి పాలు.
- 2014: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం చరిత్రాత్మక విజయం. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మూడోసారి బాధ్యతల స్వీకరణ.
- 2019: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి