ప్రజల ప్రతినిధిగా ఉండే కలెక్టర్.. ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడం ప్రజాస్వామ్య సంప్రదాయం కాదని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సిద్దిపేట జిల్లా పాలనాధికారి.. సీఎం కాళ్లపై ఎలా మోకరిల్లుతారని ఆయన నిలదీశారు. ఆచార్య జయశంకర్ 10వ వర్ధంతి సందర్భంగా.. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. జయశంకర్.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఓ మార్గదర్శకుడిలా ఉద్యమకారులను ముందుండి నడిపించారంటూ కొనియాడారు.
పాలనాధికారులు.. జిల్లా ప్రతినిధులుగా ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి. కలెక్టర్లు.. కలెక్టర్ల మాదిరిగానే వ్యవహరించాలి. దుష్ట సంప్రదాయలను పెంపొందించకూడదు. సీఎం కాళ్లు మొక్కాల్సిన అవసరం ఏముంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించం. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తాం. రాజకీయాల్లో ఇలాంటి వాటిని రూపు మాపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది.
- ప్రొ. కోదండరాం, తెజస అధ్యక్షుడు
ఆచార్య జయశంకర్ ఎవరి ముందు లొంగేవారు కాదని కోదండరాం గుర్తు చేశారు. ఎక్కడా ఎవరి ముందు తలదించుకోలేదన్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సవాళ్లను లేవనెత్తినప్పుడు నిర్మొహమాటంగా సమాధానం చెప్పేవారని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో.. ఆత్మగౌరవంతో నిలబడి పోరాడే విధానాన్ని ప్రజలకు నేర్పించారని ప్రస్తావించారు. సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత విద్యా వంతులపై ఉందనే వారని అన్నారు.
ఆచార్య జయశంకర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. సమాజం కోసం నిలబడిన వ్యక్తులను ఆదరించడం తెలంగాణ ప్రజానికానికి ఉన్న ప్రత్యేకత అని పేర్కొన్నారు. అందుకోసమే రాష్ట్ర ప్రజలు జయ శంకర్ సార్ పట్ల ఆదరణ చూపించారని వివరించారు.
ఇదీ చదవండి: KCR: వరంగల్‌లో కేసీఆర్.. కలెక్టరేట్ ప్రారంభం, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమి పూజ