ప్రభుత్వం చెబుతున్న 50 వేల ఉద్యోగ ఖాళీలను తాము ఏమాత్రం అంగీకరించడం లేదని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఉద్యోగాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ మంచి విషయమే కాని... ఇలా తక్కువ పోస్టులు చూపించడం సమంజసం కాదన్నారు. విశ్వవిద్యాలయాల్లో సగానికిపైగా ఖాళీలు ఉన్నాయని.. సిబ్బందిలేక, వర్సిటీల రేటింగ్ పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీలను గుర్తించి అందుకు అనుగుణంగా భర్తీ చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.
ఉపాధి కల్పనపై ఒక విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం చెప్పిన 50 వేల ఉద్యోగాలు అనే విషయాన్ని మేము ఏమాత్రం ఆమోదించడం లేదు. సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారు. ప్రభుత్వం గమనించాల్సిన విషయం ఏమిటంటే బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారమే లక్షా 90 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలున్నాయి.కొత్తగా ఏర్పడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పోలీస్ స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలను లెక్కలోకి తీసుకుంటే సంఖ్య ఇంకా పెరుగుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఖాళీల సంఖ్యను పెంచి మొత్తం ఖాళీలను ప్రకటించాలి. అదేవిధంగా పబ్లిక్‌రంగ సంస్థల్లో యూనివర్సిటీ వంటి స్వచ్ఛంద సంస్థల్లో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కలిపితే సుమారు 3లక్షల పైబడి ఖాళీలు ఉంటాయి. ఏ ఏడాది ఖాళీ అయిన పోస్టులను.. ఆఏడాదే భర్తీ చేయడానికి చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. -ప్రొఫెసర్ కోదండరాం, తెజస అధ్యక్షుడు.
ఇదీ చూడండి: CABINET MEET: రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. ఉద్యోగాల భర్తీపై చర్చ