Tiger roaming in Nallamala villages: ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో ఇటీవల వరుసగా పులుల సంచారం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలోనే ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మూడు సార్లు పులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. యర్రగొండపాలెం పరిధి కొలుకుల సమీపంలో.. పుల్లల చెరువు మండలం అక్కపాలెం వద్ద పులి సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. దోర్నాల పరిధి దేవలూటి వద్ద పులి దాడిలో ఓ ఆవు మరణించింది.
ఈ క్రమంలో వాటి కదలికలను తెలుసుకునేందుకు అటవీ శాఖ అధికారులు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నల్లమల అటవీ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా వాగులు, చెక్‌డ్యాంలు, కుంటల్లో జలాలు అడుగంటాయి. నీరు అందుబాటులో లేక పులులు దాహార్తి తీర్చుకునేందుకు మైదాన ప్రాంతాల్లోకి వస్తున్నాయి. మార్కాపురం డివిజన్లో 200కు పైగా సిమెంటుతో సాసర్ పిట్లు ఏర్పాటు చేశారు. వాటిలో ట్యాంకర్ల ద్వారా నీరు నింపే ప్రక్రియను అటవీశాఖ అధికారులు చేపట్టారు.
వరుసగా పులుల సంచరిస్తున్న ఆనవాలు కనిపిస్తుండడంతో నల్లమల అటవీ ప్రాంత సమీపంలో నివసిస్తున్న గ్రామాల స్థానికులు ఆవేదన చెందుతున్నారు. రాత్రి వేళలో ఏదైనా అవసరం రీత్యా బయట అడుగుపెట్టాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పులుల కదలికలను తెలుసుకోవటం కోసం అధికారులు కెమెరాలను బిగించడంతో పాటు సిమెంటుతో సాసర్ పిట్లు ఏర్పాటు చేయడంతో స్థానికులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి: