వలస కార్మికులను సొంతూర్లకు పంపించేందుకు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీసులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నా క్షేత్రస్థాయిలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక్కో సవాలును దాటుకుంటూ అడుగు ముందుకేస్తూ క్షేమంగా రైలెక్కిస్తున్నారు. మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారంటూ పోలీస్ స్టేషన్ల వద్ద వరుస కడుతున్న వేలాది మందిని ఓపికగా సముదాయిస్తున్నారు.
చివరి నిమిషం వరకు ఆందోళన..
మూడు కమిషనరేట్ల పరిధిలో బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బంగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 2 లక్షల మంది వరకు వలస కార్మికుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఒక్కో రైలులో 1200 మంది వరకు సొంతూర్లకు పంపిస్తున్నారు. ఎవరెవర్ని పంపించాలో సాఫ్ట్‌వేర్ సాయంతో లాటరీ నిర్వహించి ఎంపిక చేస్తున్నారు. ఆ జాబితా కమిషనరేట్ నుంచి సాయంత్రం సంబంధిత ఇన్‌స్పెక్టర్‌కు చేరుతుంది. చివరి నిమిషం వరకు ఆ జాబితాలో ఉన్న కార్మికుల జాడ చిక్కడం లేదు. ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. మరికొందరేమో క్యాంపులు, పునరావాస కేంద్రాల్లో కనిపించడం లేదు. ఇంకొందరేమో కాలినడకన బయలుదేరారు. ‘8 మందిని రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు రాత్రి ఆర్టీసీ బస్సు పీఎస్ దగ్గరి కొచ్చింది. ముగ్గురి జాడనే చిక్కింది. అన్ని పనులు వదిలేసి వెతికినా మిగిలిన అయిదుగురు ఎక్కడున్నారో తెలియరాలేదు’ అని ఓ ఇన్‌స్పెక్టర్ వాపోయారు. ‘మా పీఎస్ నుంచి 40 మందిని పంపించాలని ఆదేశాలొచ్చాయి. సుమారు 70 నుంచి 80 లేబర్ క్యాంపుల్లో వెతికినా 13 మంది జాడ చిక్కలేదు’ అంటూ మరో ఇన్‌స్పెక్టర్ వివరించారు.
ఎప్పుడు పంపిస్తారంటూ ఒత్తిడి..
ఆన్‌లైన్‌లో వివరాల నమోదును తాత్కాలికంగా నిలిపేయడం వల్ల వేలాది మంది పీఎస్‌లకు వరుస కడుతున్నారు. వీళ్లను సముదాయించి లేబర్ క్యాంపులకు పంపించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. వీళ్లకు తోడు ఎప్పుడు పంపిస్తారంటూ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న కార్మికులు ఒత్తిడి తెస్తున్నారు. కొందరు కాలినడకన బయలుదేరుతుండటంపై పోలీసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జాబితాలో పేరుండి జాడ చిక్కని కార్మికుల్లో కొందరు ఒకటి, రెండ్రోజుల తర్వాత పీఎస్‌లకొస్తున్నారు. జీతాలివ్వడం లేదంటూ.. ఆహారం పెట్టడం లేదని ఫిర్యాదు చేస్తే అప్పటికప్పుడు సూపర్‌వైజర్లు, గుత్తేదారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. ‘సీపీ సజ్జనార్ మార్గదర్శనంలో మా పీఎస్ పరిధిలోని 54 లేబర్ క్యాంపులను ప్రతిరోజు సందర్శించి కాలినడకన వెళ్లొద్దంటూ కౌన్సెలింగ్ ఇస్తున్నాం. సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నాం. ఎక్కడికి వెళ్లకుండా ఇంతకు ముందులాగే పనులు చేసుకోవాలంటూ నచ్చజెబుతున్నాం. కాలినడకన బయలుదేరిన వారిని గుర్తించి ఫంక్షన్ హాల్స్, సామాజిక భవనాల్లో పునరావాసం కల్పిస్తున్నాం’ అని నార్సింగి సీఐ గంగాధర్ వివరించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి సన్నాహాలు