రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభమైనా పంటల బీమా పథకంపై వ్యవసాయ శాఖ ఏమీ తేల్చలేదు. ఈ పథకం అమలు చేస్తున్నారా అని కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులను అడిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనందున ఈ పథకం అమలు డోలాయమానంలో పడింది. ఈ పథకం అమలు కావాలంటే ఈ సరికే ఒక్కో పంటకు ఎకరానికి రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం రుసుమును వ్యవసాయ శాఖ నిర్ణయించాలి. ప్రీమియం వసూలుకు బీమా కంపెనీలను ఎంపిక చేయాలి. ఈ పనులేమీ వ్యవసాయ శాఖ చేయలేదు. గడేడాది ఖరీఫ్ సీజన్‌లో ఈ పథకం అమలుకు అనుమతి ఇస్తూ 2019 మే 3న వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ వచ్చినా బీమా పథకం ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేయాలంటే మూడు నెలల ముందే బీమా కంపెనీల ఎంపికకు టెండర్లు పిలవాలి. తక్కువ రేట్లను కోట్ చేసిన కంపెనీలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ రేట్ల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన ప్రీమియం రుసుము, రాయితీ ఖరారవుతుంది.
అమలు కావాలంటే..
ప్రకృతి విపత్తుల బారినపడకుండా రక్షణ కవచంగా చెప్పుకునే ప్రధానమంత్రి పంట బీమా పథకం-పీఎంఎఫ్‌బీవై అమలు కావాలంటే కేంద్ర, రాష్ట్రాలు రెండూ కలిసి పనిచేయాలి. ఈ పథకం కింద వానాకాలంలో సాగు చేసే ఆహార పంటలకు ఎకరానికి పంట విలువలో 2 శాతం మాత్రమే రైతు కట్టాలి. అంతకన్నా ఎక్కువ ప్రీమియం ఉంటే దానిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేరి సగం భరిస్తాయని తెలుపుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు ఇవ్వాలి. ప్రధాన వాణిజ్య పంట పత్తి సహా బత్తాయి, ఆయిల్‌పాం, మామిడి, టమాట పంటల విలువతో 5 శాతం ప్రీమియం రైతు చెల్లించాలి.
రాష్ట్రం చెప్పాలని..
అంతకన్నా తక్కువ ఉంటే కేంద్రం, రాష్ట్రం సగం సగం భరించాలి. తాము సగం భరించడానికి సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రం అనుమతించిందా లేదా చెప్పాలని కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా ఆరా తీసింది. తొలకరి వర్షాలు పడగానే పత్తి సాగు మొదలుపెడతారు. ఈ పంటకు బీమా చేయించాలంటే గత ఏడాది జులై 15 వరకే గడువు ఇచ్చారు. ఈసారి ఆ గడువు ఇవ్వాలంటే పథకం అమలుపై ఇప్పటికే రైతులకు చెప్పాలి. ఈ సీజన్‌లో అసలు ఈ పథకం అమలు ఉంటుందా లేదా అనేది ఓ ప్రశ్నార్థకంగా మారిపోయింది. అయితే పథకం అమలు విషయం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సీజన్ నుంచి కేంద్రం
పంటల బీమా పథకం అమలుకు ఈ ఏడాది నుంచి కేంద్రం నిబంధనలు మార్చింది. గత ఏడాది వరకు బ్యాంకులో పంట రుణం తీసుకునే ప్రతి రైతు సైతం సొమ్ము నుంచి నిర్బంధంగా మినహాయించి బీమా కంపెనీకి పంపాలనే నిబంధన అమల్లో ఉండేంది. ఈ నియమావళిని ఈ సీజన్ నుంచి కేంద్రం తొలగించింది. ఫలితంగా అధిక శాతం మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు రారని.. అలాంటప్పుడు ఈ పథకం వల్ల ఏం ఉపయోగం ఉంటుందన్న కోణంలో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అనాసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ.. రాష్ట్రం ఉత్తర్వులు ఇవ్వకపోతే స్వంతంగా ఎవరైనా రైతులు బీమా చేయించుకోవాలన్నా సమస్యే. ఏ కంపెనీకి ఎంత ప్రీమియం చెల్లించాలో తెలియదు. ఈ పంట బీమా పథకం అమల్లో ఉంటుందా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని పలువురు రైతులు, రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి : ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్కి ఓవర్ స్పీడ్ చలానాలు