రైతుబంధు పథకం నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రిజర్వ్ బ్యాంకుకు చెందిన ఈ-కుబీర్ ప్లాట్‌ఫాం ద్వారా నగదు బదిలీ జరుగుతోందన్నారు.
ఇప్పటి వరకు 39 లక్షల మంది రైతులకు రూ.2,736 కోట్లు చేరినట్లు వివరించారు. మంగళవారం కూడా నగదు బదిలీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులందరికీ సాయం అందుతుందని హారీశ్‌రావు తెలిపారు.
50.84 లక్షల మంది రైతులకు సాయం అందించనున్నట్లు వివరించారు. జూన్ 16 వరకు పాస్ పుస్తకాలు వచ్చిన ప్రతిఒక్కరికీ సాయం అందుతుందన్నారు. రైతులకు లబ్ధిచేకూరేలా వ్యవసాయ, రెవెన్యూ, ఆర్థికశాఖ అధికారులు బాగా కష్టపడ్డారని ప్రశంసించారు.
కరోనా వల్ల ఆదాయం బాగా తగ్గిపోయినా.. రైతుబంధుకు ప్రభుత్వం నిధులు సమకూర్చిందన్నారు హరీశ్ రావు. రైతుల సంక్షేమం విషయంలో సర్కారు చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు. వానాకాలంలో రైతుబంధు కోసం కేటాయించిన రూ.7 వేల కోట్లు పూర్తిగా రైతన్నలకు చేరేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు.
ఇదీ చూడండీ : హరితహారం లక్ష్యం సాధించాలి.. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు