కాళోజీ ఆరోగ్య వర్సిటీలో సీట్ల బ్లాకింగ్ వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) రమేశ్ రెడ్డి స్పందించారు. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో 50శాతం సీట్లే కన్వీనర్ కోటా ఉన్నాయి. 10శాతం సీట్లు మేనేజ్‌మెంట్ కోటాలో నేరుగా భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. కోఠిలోని డీహెచ్ కార్యాలయంలో ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి., డీహెచ్ శ్రీనివాసరావుతో ఆయన సమావేశంలో నిర్వహించారు.
సీట్ల వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది . ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బ్లాక్‌లో వేరే వాళ్లకు కేటాయించలేదని రమేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కొందరు ఆయా రాష్ట్రాల్లో సీట్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణలో సీటు కోసం నమోదు చేసుకున్న విషయాన్ని గుర్తించినట్టు తెలిపారు. అలాంటి వారు సీటు బ్లాకింగ్‌లో ఉన్నారేమో అనే అనుమానంతో ప్రాథమిక సమాచారం సేకరించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు రమేశ్ రెడ్డి చెప్పారు.
మరోవైపు, ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్లకు శనివారం వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. మాప్ అప్ విడత వెబ్ ఆప్షన్లకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించింది. సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచింది.
ఇదీ చదవండి: తరుగు పేరుతో ధాన్యంలో కోత పెట్టొద్దు: మంత్రి గంగుల