ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయాల్లో గరిష్ఠ సామర్థ్యం మేరకు నిల్వ ఉంచి... వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని టెయిల్ పాండ్, పులిచింతల జలాశయాలు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. టెయిల్ పాండ్‌లో మొత్తం 20 క్రస్టు గేట్లకు గాను... 18 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండగా... విద్యుత్తు ఉత్పత్తి చేయటంతోపాటు 15 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల చేశారు.
దిగువ మానేరు నుంచి నీటి విడుదల
కరీంనగర్ దిగువ మానేరు జలాశయానికి మోయతుమ్మెద వాగు నుంచి భారీగా వరద చేరుతోంది. నీటిమట్టం పెరుగుతుండటంతో... మంత్రి గంగుల కమలాకర్... 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా... 23 టీఎంసీలకు చేరినట్లు తెలిపారు. ప్రాజెక్టులో నీటి నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటూనే... వరద ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నట్లు వెల్లడించారు. కాళేశ్వరం జలాలతో పాటు ఎగువన కడెం ప్రాజెక్టు నుంచి వరద వస్తుండటంతో..... పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకల సంతరించుకుంది. జలాశయం నీటి మట్టం పూర్తిస్థాయి చేరుతుండగా.... ప్రాజెక్టు గేట్లు ఎత్తి గోదావరిలోకి నీరు వదులుతున్నారు.
మీటర్ లోతులోంచి ప్రయాణం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌లోని బొగ్గుల వాగు, కాపురం చెరువు, ఆరె వాగు, మానేరు వాగులు అలుగు పోస్తున్నాయి. వరద కారణంగా వందల ఎకరాలు నీట మునిగాయి. ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొర్లుతుండగా.... జంగాలపల్లి వద్ద జాతీయ రహదారిపై వేడి వాగు ప్రవహిస్తోంది. దీనివల్ల రాకపోకలు నిలిచిపోయాయి. కేవలం లారీలకు అనుమతి ఇవ్వగా.... మీటర్ లోతు నుంచి బయటకు వస్తున్నాయి.
ఇదీ చదవండి: పరవళ్లు తొక్కుతున్న చిత్రకోట్ జలపాతం