తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు కానున్న అతిపెద్ద ఔషధ తయారీ సమూహం.. హైదరాబాద్ ఔషధనగరికి దసరా నాడు శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని శాఖలకు అంతర్గతంగా మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. ఔషధనగరికి సృజనాత్మక, ఆకర్షణీయ లోగో తయారుచేయించి, శంకుస్థాపన కంటే ముందే ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతిపాదనలను ఆహ్వానించింది. నగర శివార్లలోని రంగారెడ్డి - మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య 19 వేల ఎకరాల్లో రూ.64 వేల కోట్ల పెట్టుబడులు, 5.60 లక్షల మందికి ఉపాధి లక్ష్యంతో ఔషధనగరి ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది.
తొమ్మిదివేల ఎకరాలకుపైగా భూసేకరణ
దీనికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ పెట్టుబడులు, తయారీ మండలి (నిమ్జ్) హోదాను కల్పించింది. రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రాజెక్టు కోసం తొమ్మిదివేల ఎకరాలకుపైగా భూసేకరణ పూర్తి కాగా... మిగతా ప్రక్రియ నడుస్తోంది. ప్రతి దసరాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపట్టడం ఆనవాయితీగా ఉంది. ఈ సారి ఔషధనగరి శంకుస్థాపనపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమిలో శంకుస్థాపన చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుగుణంగా పనులు చేపడుతోంది. శంకుస్థాపన నిర్వహణపై త్వరలో సీఎం కేసీఆర్ వద్ద అత్యున్నతస్థాయి సమావేశం జరగనున్నట్లు తెలిసింది. ప్రతిపాదిత స్థలం వద్ద అనుసంధాన, అంతర్గత రహదారులు, విద్యుత్, నీటిసరఫరా, మురుగునీటి పారుదల వంటి సౌకర్యాల పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు సంబంధించి మంత్రి కేటీఆర్ అధికారులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
లోగో సృష్టికర్తకు రూ.లక్ష బహుమతి
ఔషధనగరికి లోగోను తయారు చేయించాలని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా టీఎస్‌ఐఐసీ.. వ్యక్తులు, సంస్థల నుంచి లోగో ప్రతిపాదనలను సోమవారం ఆన్‌లైన్‌లో https: //tsiic.telangana.gov.in/HPC_Logo_Design_Contest.pdf ద్వారా ఆహ్వానించింది. ప్రతిపాదనలను pm1-hpc-iic@telangana.gov.in కి పంపేందుకు ఈ నెల 30 తుదిగడువు. విజేతకు రూ.లక్ష బహుమతితోపాటు ప్రశంసాపత్రాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అక్టోబరు అయిదో తేదీన విజేతను ప్రకటిస్తామని టీఎస్‌ఐఐసీ పేర్కొంది.
ఇదీ చదవండి: "ధరణి" రూప కల్పనపై నేడు కేసీఆర్ కీలక సమీక్ష