Brijesh Kumar Tribunal News: 2010లో అంతర్‌రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ మొదటి తీర్పు ఇచ్చింది. తదుపరి వాదనల అనంతరం 2013 నవంబరులో తుదితీర్పు ఇవ్వగా దాన్ని వ్యతిరేకిస్తూ మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్... సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. పునర్విభజన తర్వాత తెలంగాణ అందులో భాగస్వామి అయ్యింది. అప్పటినుంచి ఈ ఎల్ఎస్పీ (SLP) విచారణలో ఉండగా... తుది తీర్పునకు లోబడి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశించాలని కర్ణాటక మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఆ విషయంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
ఉమ్మడి ఏపీ విఫలం..
కృష్ణా జలవివాద ట్రైబ్యునల్ (Brijesh Kumar Tribunal)-1, 2... తెలంగాణ అవసరాలను పట్టించుకోలేదని... న్యాయమైన వాటాను రాబట్టడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విఫలమైందని తెలంగాణ పేర్కొంది. బచావత్ ట్రైబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటకలకు చేసిన కేటాయింపులపై సమస్య లేదంది. కృష్ణా ట్రైబ్యునల్-2 ఇచ్చిన రెండు తీర్పులను వ్యతిరేకిస్తామని పేర్కొంది. ఎగువన ప్రవాహాన్ని ఆపడం... అక్కడి ప్రాజెక్టులు నిండి, వినియోగం జరిగాకే... దిగువకు వదులుతున్నారని తెలిపింది.
రెండు నదుల్లోనూ...
కృష్ణా, తుంగభద్ర రెండు నదుల్లోనూ ఆ పరిస్థితి ఉందని పేర్కొంది. ఫలితంగా నీటిలభ్యత తక్కువగా ఉన్న సంవత్సరాల్లో తెలంగాణకు దైన్యస్థితి తప్పట్లేదని వివరించింది. ట్రైబ్యునల్ తీర్పు (Brijesh Kumar Tribunal)ను నోటిఫై చేయకపోవడం వల్ల... నీటి కేటాయింపుల ఆధారంగా ప్రాజెక్టులు కట్టుకోలేకపోతున్నామని కర్ణాటక పేర్కొనడం సత్యదూరమందని పేర్కొంది. వారి వాదన సరైంది కానందున పిటిషన్‌ను తిరస్కరించాలని తెలంగాణ కోరింది.
ఏపీ ప్రయత్నం...
తెలుగు రాష్ట్రాల అభ్యంతరాలపై తన సమాధానాలను కర్ణాటక తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించింది. తమకు న్యాయంగా దక్కాల్సిన వాటాను అడ్డుకోవడానికి... ఆంధ్రప్రదేశ్ నిరంతరం ప్రయత్నిస్తోందని పేర్కొంది. తుది తీర్పునకు లోబడి 75 శాతం నీటిని వాడుకునేలా గెజిట్‌లో ప్రచురించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించింది.
ఇదీ చదవండి: Telangana Cabinet Meeting: రేపు మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం.. ధాన్యం కొనుగోలే కీలకాంశం