‘స్వరూపా... స్వరూపా...’’ బిగ్గరగా పిలుస్తూ లోపలికి వచ్చాను నేను. స్వరూప కిచెన్ నుండి బయటకు వస్తూ ‘‘ఏంటి అంత పెద్దగా పిలుస్తున్నారు? పైగా చాలా సంతోషంగా ఉన్నారు. ఏంటి విషయం’’ అంటూ దగ్గరగా వచ్చింది.
‘‘పవన్ కన్పించాడు’’ నా ముఖం ఎంతగా వెలుగుతుందో నాకు తెలుసు.
‘‘అవునా... ఎలా? ఎక్కడ?’’ ఆశ్చర్యపోతూ నా చేయి పట్టుకుని తీసికెళ్లి సోఫాలో కూర్చోబెట్టి పక్కన తనూ కూర్చుంది.
‘‘దేవాలయానికి వెళ్లి అష్టోత్తరం చేయించుకుని బయటకు వచ్చాను. ఎదురుగా పవన్... నేనే తనని గుర్తు పట్టాను.’’
‘‘నిరంతరం మీ ధ్యాస అటే ఉంది కదా. ఊఁ... చెప్పండి చెప్పండి’’ అంది ఎంతో ఉత్సాహంగా.
‘‘చాలా పెద్దవాడిలా అయిపోయాడు... నాలాగే సంవత్సరం క్రితం రిటైరయ్యాడట. ఇద్దరు అమ్మాయిలట. పెళ్లిళ్లు అయ్యాయి. పెద్దమ్మాయికి ఒక బాబు, చిన్నమ్మాయికి పెళ్లయి ఆరు నెలలు అయిందట. చాలా సంతోషంగా ఉంది స్వరూపా. ఈరోజు వాళ్ల పెళ్లిరోజట అందుకే ఇంత పెందలాడే వచ్చి దర్శనం చేసుకుని కాస్సేపు కూర్చుని వెళ్లబోతున్నారు. నేను చూశాను. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా... మన వెనుక వీధిలోనే వాళ్లు ఉంటున్నారు.’’
‘‘అవునా’’
నా మితిమీరిన ఆనందం నాలో ఎంత ఉత్తేజాన్ని నింపిందో నాకే తెలుసు. నాతోపాటు స్వరూపకు కూడా తెలుసు.
‘‘స్వరూపా... టిఫిన్ రెడీ చేయి. వాళ్లిద్దరూ ఈ రోజు మన అతిథులు. నాతోనే తీసుకొద్దామంటే- ఓసారి ఇంటికెళ్లి వస్తామన్నారు’’ అంటూ చాలా హడావుడి చేశాను నేను.
* * * * *
నా బాల్యమిత్రుడు పవన్... నాన్నగారికి వాళ్ల ఊరు ట్రాన్స్‌ఫర్ అయింది. మూడవ తరగతి నుండి పదవ తరగతి దాకా నేనూ పవన్ ఒకే స్కూల్లో చదువుకున్నాం. వాళ్లది సొంత ఇల్లు. వాళ్ల ఇంటికి ఎదురింట్లో మేము అద్దెకున్నాం. మా ఇంట్లో అక్కా, నేనూ ఇద్దరం. పవన్ ఏకైక సంతానం. ముగ్గురం కలిసి స్కూలుకు వెళ్లేవాళ్లం. పవన్ నాన్నగారిది రెండెకరాల వ్యవసాయం. ఆ పనులలో ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. అమ్మానాన్నా వాళ్లకి కుదిరినప్పుడు పవన్ అమ్మానాన్నగారితో మాట్లాడుతుండేవారు. అన్నింటికన్నా నేనూ పవన్ ఒక్కటే అన్నట్లుగా ఉండేవాళ్లం. ఒకే బెంచీ... కలిసి తినటం... కలిసి చదువుకోవడం... మా ఇంట్లో పడుకునేవాడు. ఒక్కోసారి నేను కూడా వాళ్లింట్లో పడుకునేవాణ్ణి. పవన్ మనస్తత్వం నన్ను చాలా మార్చేసింది. నాలో దుడుకుతనం తగ్గింది. ఒక క్రమశిక్షణకు అలవాటు పడ్డాను. ముఖ్యంగా చదువు... నేను బిలో ఏవరేజ్ స్టూడెంట్‌ని. నన్ను బాగా చదివిస్తూ తనకంటే నాలుగు మార్కులు ఎక్కువ వచ్చేలా చేశాడు. అయిదో క్లాసుకి వచ్చేసరికి నేను క్లాసు ఫస్ట్ అయ్యాను. మా అమ్మానాన్నగారి అనందం అంతా ఇంతా కాదు. పవన్‌ని నాతో సమానంగా ప్రేమగా చూసుకునేవారు. టెన్త్‌లో జిల్లా ఫస్ట్ వచ్చాను. పవన్‌కు కూడా చాలా మంచి మార్కులే వచ్చాయి. జిల్లా కలెక్టర్ చేత నాకు సన్మానం జరిగింది. పవన్‌లో జెలసీ, కోపం, ఆవేశం లాంటివి ఏవీ ఉండేవి కావు. నవ్వు ముఖంతో ఎప్పుడూ ప్రశాంతంగా కనపడేవాడు. మొహమాటం, బిడియం మాత్రం ఉండేవి.
నాన్నగారికి ట్రాన్స్‌ఫర్ అయింది. పవన్ నేనూ కౌగిలించుకుని చాలాసేపు ఏడ్చాం. అలా పవన్ నాటిన గింజను నేను. చాలా దూరం వెళ్లిపోయాం. ఇంటర్‌లో మంచి మార్కులు, తర్వాత బి.కామ్ అలా అలా ఎదిగి బ్యాంకు జాబ్‌లో స్థిరపడ్డాను. పెళ్లీ పిల్లల మధ్య నాకు ట్రాన్స్‌ఫర్స్... స్నేహితుడి సాయంతో బలమైన మొక్కగా ఎదిగిన నేను వృక్షమై ఫలాలను అందిస్తున్న విషయం పవన్‌కి తెలియాలని తపన. స్వరూపతో పవన్ ఊరికి వెళ్లాను. ఊరు మొత్తం మారిపోయింది. పవన్ తల్లీ తండ్రీ చనిపోయినట్లు తెలిసింది. పవన్ ఆ ఊరిలో ఉన్న రెండెకరాల పొలం, ఇల్లూ ఎప్పుడో అమ్మివేశాడని తెలిసింది.
నాకున్న ఏకైక కోరిక- పవన్‌ని కలవటం... చిన్నప్పుడు దూరం వల్ల కలిసే మార్గాలు లేకుండా అయింది. తర్వాత్తర్వాత ప్రయత్నాలు ఫలించలేదు. పవన్ నా జీవితం లోకి రాకుంటే నేను ఖచ్చితంగా ఈ స్థాయిలో ఉండేవాణ్ణికాదు. అది మాత్రం నిజం.
* * * * *
పవన్ భార్య నిర్మలతో వచ్చాడు. పవన్‌ని మరోసారి కౌగిలించుకున్నాను. స్వరూపకి ఇద్దరినీ పరిచయం చేశాను. ఇల్లంతా చూపించాను. నలుగురం కలిసి టిఫిన్ చేశాం. ఏది మాట్లాడుతున్నా నా కళ్లు చమర్చుతుంటే స్వరూప వద్దన్నట్లు తల కదిలించింది. నా ఉద్వేగాన్ని బలవంతంగా ఆపుకున్నాను.
‘‘పవన్, మనం చిన్నప్పటిలా మాట్లాడుకుందాం’’
‘‘అంటే... అర్థంకాలేదు’’ చిరునవ్వు నవ్వాడు పవన్.
‘‘ఏదీ దాయకుండా అన్ని సంగతులూ చెప్పుకునేవాళ్లం కదా... ఇప్పుడూ అలాగే చెప్పాలి. నీ విషయాలు ఏంటి? ఎలా సాగింది నీ జీవన ప్రయాణం. అన్నింటికన్నా ముందు నాకో విషయం చెప్పు. నేను... నీకు గుర్తున్నానా?
‘‘చాలా గుర్తున్నావు... అప్పుడప్పుడు నిర్మలతో అంటుంటా కూడా. అక్క ఎక్కడ ఉంటోంది?’’
‘‘ఇక్కడే ఈ ఊళ్లోనే...’’
‘‘వాట్’’
‘‘యస్... నాలుగు సంవత్సరాలైంది ఉండబట్టి. బావగారు రిటైరైన తర్వాత వాళ్ల బ్రదర్ ఇక్కడ ఉండడంతో వీళ్లూ ఇక్కడే ఇల్లు కట్టించుకుని స్థిరపడిపోయారు. అమ్మా నాన్నగారు చనిపోయారు. ఇద్దరం కలిసి ఉండాలని అక్క ఇక్కడ ఇల్లు చూసింది. కొన్నాను. నీ గురించి ఎంతగా ఆలోచించేవాడినో. ఎలాగైనా నిన్ను కలవాలి. ఈ జీవితంలో నిన్ను కలవగలనో లేదో అని చాలా బాధపడేవాణ్ణి. బ్యాంకులో జాబ్ కావటంతో రకరకాల ప్రదేశాలు చూశాను. ప్రాంతాలు మారాను. మాకు ఒక్కడే అబ్బాయి. వాడు అమెరికాలో... కోడలూ వాడూ జాబ్స్... త్రీ ఇయర్స్ బాబు... ఇంకా... అంటే... ఇక అంతే... నీ గురించి చెప్పు.’’
‘‘ఊళ్లో ఉన్న రెండెకరాలూ ఇల్లూ అమ్మేసి ఇప్పుడు ఉంటున్న ఇల్లు కొన్నాను. అమ్మానాన్నా చనిపోయారు. నేను ఇక్కడ. ఊళ్లో పొలమూ ఇల్లూ చూసుకోలేను. అందుకే తీసేశాను. ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి జాబ్ చేయట్లేదు. ఆరేళ్లబాబు. అల్లుడు సాఫ్ట్‌వేర్... చిన్నమ్మాయికి ఆర్నెల్ల క్రితం పెళ్లయింది. అల్లుడూ అమ్మాయీ ఇద్దరూ సాఫ్టవేర్ జాబ్స్. అంతా హైదరాబాదులో ఉన్నారు. మేం ఇక్కడ’’ నవ్వాడు పవన్.
‘‘ఆర్థికంగా అంతా బాగేనా?’’
‘‘బాగా అంటే ఫర్వాలేదు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాను కదా. పెన్షన్ వస్తుంది. అనారోగ్యాలు పెద్దగా ఏం లేవు. ఓకే’’
‘‘అప్పులు’’
‘‘ఏదో... కొద్దిగా ఉన్నాయి. కాకపోతే మనశ్శాంతిని పోగొడుతున్న విషయం ఒకటుంది. పెద్దమ్మాయివాళ్లు ఒక ఫ్లాట్ కొన్నారు. పదిలక్షలు కూడబెట్టుకున్నామని ముప్ఫయి లక్షల లోన్ తీసుకుని ఇల్లు ప్లాన్ చేశారు. నాకెందుకో అలా నచ్చలేదు రామచంద్రా... అమ్మాయి మామగారు పేషెంట్. అత్తగారికి బీపీ షుగర్.
చాలా మంచివాళ్లు. అమ్మాయిని మాకంటే ఎక్కువగా చూసుకుంటారు. వాళ్ల ఖర్చులూ... పిల్లాడి చదువూ... ఈ పరిస్థితుల్లో లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కోవాలా చెప్పు...’’
‘‘ఈ రోజుల్లో అది చాలా కామన్...’’
‘‘నిజమేలే... ఆ రోజుల్లో... నేను డబ్బు కూడేసి వస్తువు కొనేవాణ్ణి. వాయిదా పద్ధతుల్లో ఏదీ కొనలేదు. సొంత ఇల్లు అంటే అమ్మానాన్నగారి దయ. పిల్ల ఎప్పుడూ సంతోషంగా కనిపించాలని నా తపన. వడ్డీతో కలిపి, కట్టాల్సింది ఎక్కువే అవుతుంది. అల్లుడి జీతంలో సగం లోన్‌కే పోతోంది. దాంతో ఎప్పుడూ ఏవో ఇబ్బందులు. ఇదంతా నేను చూడలేను, అలా అని సాయం చేసే స్థితిలోనూ లేను. అందుకే అమ్మాయి జాబ్ చేయాలనుకుంటోంది.’’
‘‘మంచిదే కదా’’
‘‘మంచిదే కానీ అమ్మాయికి బాగా కష్టమవుతుంది’’ దిగులుగా అన్నాడు పవన్.
పవన్‌కి పిల్లలంటే ప్రాణం అని నాకు అర్థమయింది.
* * * * *
భోజనాలు ముగిసిన తర్వాత పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ వాళ్లిద్దరికీ బట్టలు పెట్టాం. వద్దంటే వద్దన్నారు. బలవంతంగా ఇచ్చాం.
‘‘నాకంటే నువ్వు నాలుగు నెలలు పెద్ద. దండం పెట్టనా?’’ అంటూ వంగబోతున్న పవన్‌ను అక్కున చేర్చుకున్నాను నేను.
‘‘ఇలాంటి ఓ శుభ ఘడియ వస్తుందని అనుకోలేదు పవన్. దండం పెట్టాలంటే నేనే నీకు పెట్టాలి. బాగానే సంపాదించాను. కొడుకును ఎమ్మెస్ చేసేందుకు అమెరికా పంపగలిగాను. చిన్నప్పుడు నీ అండతోనే నేను తీర్చిదిద్దబడ్డాను.’’
‘‘ప్లీజ్ అలా అనకు రామచంద్రా’’
‘‘ఇది నిజం పవన్... నీకెలాగైనా అనిపించనీ నేను నమ్మింది అది.’’
‘‘ఎప్పుడూ మీ గురించే ఆలోచన పవన్‌గారూ’’ కళ్లు తుడుచుకుంది స్వరూప. పవన్, నిర్మల నిర్ఘాంతపోయారు. ఓ రెండు గంటలు అలాగే మాట్లాడుకున్న తర్వాత ఇద్దర్నీ అక్కావాళ్లింటికి తీసుకెళ్లాను. అక్క ఉబ్బితబ్బిబ్బయిపోయి ‘పవన్’ అంటూ దగ్గరకి తీసుకుంది. బావగారిని పరిచయం చేశాను. అంతా ఆత్మీయంగా మాట్లాడుకున్నాం. రాత్రి మా అందరి భోజనం అక్కావాళ్లింట్లోనే. బయల్దేరేముందు అక్కాబావగారు కూడా వాళ్లకు బట్టలు పెట్టారు. పెళ్లిరోజు విషెస్ మళ్లీ చెప్పారు. పవన్‌లో మొహమాటం, బిడియం కన్పిస్తుంటే చిన్నప్పటి పవన్ రూపం కళ్లముందు నిలిచింది. కారులో పవన్ ఇంటికి వెళ్లాం.’’
‘‘ఏదో చిన్న ఇల్లు’’ అన్నాడు పవన్ తాళం తీస్తూ
‘‘చాలా పెద్ద మనసు’’ అన్నాను నేను. ఓ గంటసేపు కూర్చున్నాం.
‘‘టూ వీలర్ కోసం నేనే వస్తాను. నువ్వేం తేకు. వద్దంటున్నా కారులో తిప్పావు’’ అన్నాడు పవన్. నేను స్వరూపవైపు చూసి చిరునవ్వు నవ్వాను ఎంత మంచివాడో చూడు అన్నట్లు. నిర్మల ఇల్లు సర్దిన విధానం చూసి చాలా ముచ్చట పడింది స్వరూప.
* * * * *
నేను చెప్పింది విని కొయ్యబారిపోయారు పవన్, నిర్మల.
‘‘ఏంటీ... ఇంకా నయం... వద్దు రామచంద్రా... అస్సలు వద్దు ప్లీజ్’’ అన్నాడు పవన్.
‘‘ముందు మీరిద్దరూ రిలాక్సవండి. అమ్మా నిర్మలా, నన్ను నీ సొంత అన్నయ్యలా భావించు. నాకు ఇప్పటికి నాలుగు ఇళ్లు ఉన్నాయి. స్థలాలూ కొన్నాను. అబ్బాయి అమెరికాలో బాగానే సంపాదిస్తున్నాడు. అక్కావాళ్లు మాకంటే పైమెట్టునే ఉన్నారు. బ్యాంకు బాలెన్స్ చాలా ఉంది. వాస్తవం చెబుతున్నాను. జీవితం శాశ్వతం కాదు కదా... ఇద్దరు మనుషులు తినటానికి ఎంత కావాలి? నాకే ఇబ్బందులూ లేవు. స్వరూపకు అంతా చెప్పాను. ఓ గంటలో హైదరాబాదు బయలుదేరుదాం...’’ కూతురు సంతోషంగా కనిపించాలని పవన్ అనుకుంటుంటే పవన్ సంతోషంగా కనిపించాలని నేను కోరుకుంటున్నాను.
‘‘రామచంద్రా...’’
‘‘నలుగురం వెళ్దాం. అమ్మాయితో అల్లుడితో మాట్లాడి ఈ ముప్ఫయి లక్షలు ఇచ్చి వద్దాం. నాకు వడ్డీ వద్దు. వాళ్లు కాస్త నిలదొక్కుకున్నాక, అసలు మాత్రం తీసుకుంటాను. వడ్డీ భారం లేకపోతే పిల్లలకు కాస్త వెసులుబాటుగా ఉంటుంది.
పవన్ కళ్లనిండా కన్నీళ్లు...
‘‘పవన్... నా జీవితంలో నేను కోరుకుంది లభించింది... అదే నీ స్నేహం. మనం మన చిన్నప్పటిలా మళ్లీ కలిసి ఉండబోతున్నాం అన్న ఆనందం ముందు నాకు ఈ డబ్బు ఓ లెక్కలోదికాదు. నీ పిల్లలూ నా పిల్లలే... నా కొడుకు అంత దూరంలో ఉన్నాడు. నీ పిల్లలు ఎదురుగా కన్పిస్తారు. అలా నాకూ స్వరూపకూ ఎంత హ్యాపీ... ఏదైనా మనం అనుకోవటంలోనే ఉంటుందిగా పవన్... ఏమంటావు?
‘‘ఏమంటాను రామచంద్రా... శ్రీకృష్ణుడు కుచేలుడి ఇంటికి వచ్చాడంటాను... అదృష్టం తలుపు తట్టింది, నేను తీశాను అంటాను.’’
‘‘ప్లీజ్ పవన్... అలా అనకు. నీ స్నేహం కన్నా ఎక్కువైంది నాకు ఈ ప్రపంచంలో ఏదీలేదు. నీ టూవీలర్ తెచ్చాను. క్యాష్‌బ్యాగ్ తీసుకో. పది నిమిషాల్లో కారు తెస్తాను’’ అంటూ పవన్‌ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నాను. నాకు లోకాన్నే జయించినంత ఆనందంగా ఉంది.
ఇదీ చూడండి: Friendship: స్నేహ బంధానికి టెక్నాలజీ వేదికైతే..!