రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 48.84 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. గడిచిన అయిదారేళ్లలో ఇంత పెద్ద ఎత్తున కొనటం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. వానాకాలం(ఖరీఫ్)లో వేసిన పంట కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం 6,506 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తి కావటంతో వాటిని పౌరసరఫరాల శాఖ మూసివేసింది. సుమారు కోటి మెట్రిక్ టన్నుల(ఎంటీల) ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గింది. సన్న వంగడాలను అధిక విస్తీర్ణంలో వేసిన వారు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 75 లక్షల ఎంటీలు కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నా 65.12 శాతం మాత్రమే సేకరించింది. అందులో లావు ధాన్యం 28.89 లక్షల ఎంటీలు కాగా సన్నాలు 19.95 లక్షల ఎంటీలు. మొత్తం 10,98,940 మంది రైతులు ధాన్యం విక్రయించగా వారికి ఇప్పటికి రూ.9,091.31 కోట్లు చెల్లించారు.
గడిచిన ఏడాది వానా కాలంలో 47 లక్షల ఎంటీల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. వానాకాలంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో పంట దెబ్బతినటంతో అక్కడి వ్యాపారులు తెలంగాణ రైతుల నుంచి సుమారు పది లక్షల ఎంటీలు కొన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని బియ్యం వ్యాపారులు సుమారు 16 లక్షల ఎంటీల వరకు కొన్నట్లు సమాచారం. ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి సంబంధించి కస్టం మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)కింద మిల్లర్ల నుంచి 32.72 లక్షల ఎంటీల బియ్యం రావాల్సి ఉంది. మిల్లర్లు ఇప్పటి వరకు 11.17 లక్షల మెట్రిక్ టన్నులను భారత ఆహార సంస్థకు అందజేశారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి : చాడ