ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తుంటే.. అందులో ఒకటి లూప్ లైన్‌లోకి వెళితేనే రెండోది ముందుకు సాగుతుంది. లేదంటే రెండూ ఢీకొంటాయి. డబుల్ లైన్‌లో వెళుతున్న రైలు మధ్య స్టేషన్‌లో ప్రయాణికుల్ని ఎక్కించుకోవాలన్నా, దింపాలన్నా ప్లాట్‌ఫారానికి వెళ్లాలి. ఇందుకోసం ప్రధానమార్గం నుంచి ట్రాక్ మారాల్సిందే. ఇలాంటి సమయంలో ట్రాక్‌పై రైలు దిశను మార్చడంతో పాటు, సురక్షితంగా బండి ముందుకెళ్లాలంటే.. పాయింట్ మెషిన్ లేదా పాయింట్ మోటార్ ఉండాలి. రైలు లైను మారేటప్పుడు దాని గమనాన్ని సురక్షితంగా లాక్ చేయడంతో పాటు రైళ్ల వేగంతో వచ్చే ప్రకంపనల నివారణలోనూ పాయింట్ మెషిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో వీటిని ఇప్పటివరకు రెండుచోట్లే తయారుచేస్తున్నారు. డిమాండ్‌కు సరిపోక ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియాలో భాగంగా పాయింట్ మెషిన్ల తయారీ, సరఫరాకు దక్షిణమధ్య రైల్వే(South Central Railway) పరిధిలోని మెట్టుగూడ సిగ్నల్ టెలికమ్యూనికేషన్స్ యూనిట్ అనుమతి పొందింది. ఈ యంత్రాల తయారీకి అవసరమైన అంతర్గత సాంకేతికతను తాజాగా అభివృద్ధి చేసింది. 143ఎం.ఎం., 220 ఎం.ఎం. పాయింట్ మెషిన్ల తయారీ, సరఫరా చేసే మూడో యూనిట్‌గా గుర్తింపు పొందిందని ద.మ.రైల్వే శనివారం ప్రకటించింది.
స్వల్ప ధర.. అధిక వేగం..
మెట్టుగూడ యూనిట్‌లో ఉత్పత్తి ద్వారా పాయింట్ మెషిన్లు భారీగా, తక్కువ ధరకే లభిస్తాయని ద.మ.రైల్వే వర్గాలు చెబుతున్నాయి. క్లాంప్‌లాక్‌తో తయారుచేస్తున్న 220ఎం.ఎం. పాయింట్ మెషిన్లతో ట్రాక్ సామర్థ్యంతో పాటు రైళ్ల వేగాన్ని గరిష్ఠ స్థాయికి పెంచి నడిపించేందుకు అవకాశాలు ఉన్నాయంటున్నాయి. మెట్టుగూడ యూనిట్‌కు ఏడాదికి 3,250 వరకు మెషిన్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటుందని, వీటి జీవితకాలం 12 ఏళ్లని అధికారులు చెబుతున్నారు. తద్వారా ద.మ.రైల్వే అవసరాలు తీరి, ఇతర జోన్లకూ సరఫరా చేయవచ్చంటున్నారు. అధికారులు, సిబ్బంది కృషిని ద.మ.రైల్వే జీఎం గజానన్ మాల్యా అభినందించారు.
ఇదీ చదవండి: Plug and Play center in Hyderabad : హైదరాబాద్‌కు ‘ప్లగ్ అండ్ ప్లే’ కేంద్రం.. ప్రారంభం ఎప్పుడంటే?