ఉప్పుడు బియ్యం వ్యవహారం వేలమంది ఉపాధిని ప్రశ్నార్థకంగా మార్చనుంది. యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. దీనివల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉండటంతో వరి వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరుతోంది. ఇప్పుడు అన్నదాతల పరిస్థితి ఏమిటనేది ఒక ప్రశ్న అయితే.. వరి సాగుమీద ఆధారపడి పరోక్షంగా ఉపాధి పొందేవారి సంగతి ఏమిటనేది మరో ప్రశ్న.
రైస్ మిల్లుల పరిశ్రమ కుదేల్...
వరి సాగు చేయకపోతే రైస్ మిల్లుల పరిశ్రమ కుదేలవుతుంది. వడ్లను బియ్యంగా మర్చే క్రమంలో వచ్చే ఉప ఉత్పత్తులను ఇథనాల్, బీరు, రైస్ బ్రాన్ ఆయిల్ తయారీకి, కోళ్లు, చేపల దాణాకు ఉపయోగిస్తారు. వరి సాగవకపోతే వాటి ధరలూ పెరిగే ప్రమాదం ఉన్నట్లే! వరి సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది. తాజా పరిస్థితులతో వరి చేయకపోతే రైస్ మిల్లులు, అనుబంధ పరిశ్రమల భవిష్యత్తుపై నీలి నీడలు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉపాధి దెబ్బతినే అవకాశం...
రాష్ట్రంలో 1,005 ఉప్పుడు బియ్యం, 1,675 సాధారణ బియ్యం మిల్లులున్నాయి. వరి సాగు చేయ
పోతే రైస్ మిల్లుల్లోని కార్మికుల ఉపాధి దెబ్బతినే అవకాశముంటుంది. ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చే ప్రక్రియలో ఆరు నెలల పాటు మిల్లులు 24 గంటలూ పని చేస్తుంటాయి. సామర్థ్యం మేరకు ఒక్కోదానిలో 60 నుంచి 100 మంది వరకు రోజువారీగా పని చేస్తారు. ధాన్యాన్ని మిల్లులకు తీసుకురావటం, బియ్యంగా మార్చాక ఎఫ్‌సీఐకి లేదా మార్కెట్లకు తరలించేందుకు లారీ డ్రైవర్లు, క్లీనర్లు, హమాలీలు కూడా పెద్ద సంఖ్యలో పనిచేస్తారు. ఉప ఉత్పత్తుల పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల ఉపాధిపైనా ప్రభావం పడనుంది. మొత్తంగా సుమారు 5 నుంచి 6 లక్షలమంది ఉపాధి దెబ్బతింటుందని దక్షిణాది రాష్ట్రాల రైస్ మిల్లుల సంఘం అంచనా వేస్తోంది. వరి సాగు చేయకపోతే ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు మిల్లులకు పని ఉండదని చెబుతోంది.
వాతావరణంతోనే తిప్పలు...
యాసంగిలో వేడి వాతావరణం కారణంగా ధాన్యంలో తేమ శాతం గణనీయంగా తగ్గిపోతుంది. మిల్లులో ఆడినప్పుడు కనీసం 40 నుంచి 50 శాతం వరకు ముక్కలైపోతాయి. ఎఫ్‌సీఐ 20 శాతం వరకు నూకలనే ఆమోదిస్తుంది. అంతకుమించి ఉంటే తీసుకోదు. అందుకే యాసంగిలో వచ్చే ధాన్యంలో 90 శాతానికిపైగా ఉడికించి, ఎండబెట్టి ఉప్పుడు బియ్యంగా మారుస్తారు. వానా కాలంలో చల్లదనం ఎక్కువగా ఉండటంతో ఈ సమస్య ఉండదు. ధాన్యాన్ని సాధారణ బియ్యంగా మారుస్తారు. యాసంగితో పోలిస్తే నూకల శాతం తక్కువగా ఉంటాయి.
కేంద్రం ఏకపక్ష నిర్ణయంతోనే చిక్కులు..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతోనే ఇటు రైతులు, అటు రైస్ మిల్లుల్లో పని చేసే వారి ఉపాధి ప్రమాదంలో పడింది. తెలంగాణలోని వాతావరణం కారణంగా యాసంగిలో ఉప్పుడు బియ్యమే వస్తాయి. లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. కేంద్రం ఒక్కసారిగా కొనుగోలు నిలిపేస్తే రానున్న రోజుల్లో తీవ్ర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కేంద్రం ఇప్పటికైనా పునరాలోచన చేయాలి.
- గుంగుల కమలాకర్, మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ
రైతులను, కార్మికులను ఆదుకోవాలి...
వరి సాగు చేసే రైతులను, రైస్ మిల్లులపై ఆధారపడి పని చేసే కార్మికుల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరించి తగిన పరిష్కారం కనుగొనాలి. ఒక్కసారిగా వరి సాగు నిలిపివేస్తే ఆరు నెలలపాటు మిల్లులు మూతపడతాయి. దశలవారీగా వరి సాగును నియంత్రిస్తే బాగుంటుంది. నూకలు తక్కువ వచ్చే వంగడాలను రూపొందించాలి.
- గంపా నాగేందర్, అధ్యక్షుడు, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్