రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రూపాయల రుణాల ద్వారా సమీకరించుకోనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. 19, 21 ఏళ్ల కాలానికి 500 కోట్ల చొప్పున బాండ్లు విడుదల చేసింది. ఈ నెల 31వ తేదీన ఆర్బీఐ ఆ బాండ్లను వేలం వేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 31,500 కోట్ల రూపాయలను అప్పుల రూపంలో సమమీకరించుకొంది. తాజాగా మరో వెయ్యి కోట్ల రూపాయల కోసం బాండ్లు జారీ చేసింది. దీంతో అప్పు మొత్తం 32,500 కోట్లకు చేరనుంది.
ఇక రాష్ట్రంలో రైతులకు చెల్లింపుల కోసం నాబార్డు ద్వారా పౌరసరఫరాల సంస్థ 3 వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంది. 2022 వానా కాలం సీజన్‌లో పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంకి సంబంధించి చెల్లింపులు చేయడానికి నాబార్డ్ ఈ రుణం తీసుకున్నామని పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన పౌరసరఫరాల సంస్థ బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రుణ సేకరణ నిమిత్తం నిర్వహించిన టెండర్‌లో నాబార్డ్ సింగిల్ టెండర్ వేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రుణపరిమితి నిబంధనలకు అనుగుణంగా నాబార్డు నుంచి రుణ సేకరణ జరిపినట్లు తెలిపారు. గత వానా కాలం మార్కెటింగ్ సీజన్‌లో పౌరసరఫరాల సంస్థ 9.65 లక్షల మంది రైతుల వద్ద నుంచి 13,189 కోట్ల రూపాయల విలువ చేసే 64.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని చెప్పారు.
తాజాగా తీసుకున్న 3 వేల కోట్ల రూపాయల్లో 500 కోట్ల రూపాయల వరకు రైతులకు చెల్లింపులు చేస్తుండగా... మిగిలిన మొత్తం గతంలో తీసుకున్న స్వల్పకాలిక రుణాలు తిరిగి చెల్లించడానికి ఉపయోగపడుతుందని రవీందర్ సింగ్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: