దక్షిణ మధ్య రైల్వే గత సంవత్సరం ముఖ్యమైన మార్గాల్లో ట్రాకు పటిష్ఠత కోసం అనేక పనులు చేపట్టింది. దీంతో జోన్ నెట్‌వర్క్‌లో వివిధ సెక్షన్లలో రైళ్లు వీలైనంత పరిమిత వేగం పెంపుతో ప్రయాణించే అవకాశం ఏర్పడింది. ఈ ట్రాక్ మెరుగుదల పనులతో ప్రయాణ సమయం తగ్గడంతో.. పలు ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ అన్ రిజర్వ్‌డ్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా నడిపిస్తోంది. కొవిడ్-19 కారణంగా ఆగిపోయిన రైళ్లను తిరిగి పునరుద్ధరించింది. ఈ నెల 19 నుంచి 82 ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. అందులో 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 66 ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. వాటిలో మెము, డెము రైళ్లూ ఉన్నాయి.
అయితే వీటికి ముందస్తు రిజర్వేషన్ సదుపాయం లేదని రైల్వే శాఖ వెల్లడించింది. అన్ని రైళ్లను అన్ రిజర్వ్‌డ్ కేటగిరిలోనే నడుపుతున్నామని తెలిపింది. రైలు బయలుదేరే ముందు స్టేషన్‌లోని బుకింగ్ కౌంటర్‌లో గానీ, ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్ ద్వారా గానీ టికెట్ తీసుకొని రైలు ఎక్కాల్సి ఉంటుందని రైల్వేశాఖ పేర్కొంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అంతా బాగానే ఉన్నా.. వీటి ఛార్జీలు మాత్రం ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్థాయిలో ఉన్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కాజీపేటకు గతంలో ప్యాసింజర్ రైలులో వెళ్లాలంటే రూ.35 వరకు ఛార్జీ ఉండేది. అదే ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కితే అన్ రిజర్వ్‌డ్ బోగీలో రూ.65 వసూలు చేసేవారు. తాజాగా అధికారులు ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో కాజీపేటకు వెళ్లాలంటే ఎక్స్‌ప్రెస్ రైలు స్థాయి ఛార్జీని సుమారు రూ.85 చెల్లించాల్సి వస్తోంది. అంటే ప్రత్యేక రైళ్లకు అదనంగా 1.3 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నడుపుతున్న రైళ్లన్నీ ఎక్స్‌ప్రెస్‌లేనని.. అందుకే ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నామని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి వారిపై పెనుభారం మోపుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. కొన్నింటినైనా ప్యాసింజర్ రైళ్లను నడిపించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
రైళ్ల పునరుద్ధరణ..
కరోనాతో రద్దయిన రైళ్లు(Trains).. ఈనెల 19 నుంచి అందుబాటులోకి వచ్చాయి. గతంలో తిరిగిన రైళ్ల(Trains) స్థానంలోనే కొత్త నంబర్లతో రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వీటిలో.. డెము, మెము ప్యాసింజర్లు ఇక నుంచి వేగంగా పరుగెత్తనున్నాయి. వాటిని కూడా ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగంతో నడిపించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
వేగం పెరిగింది..
గతంలో ఇవి తక్కువ వేగంతో ప్రయాణించేవి. టికెట్ ధర తక్కువ అయినా.. అధిక సమయం ప్రయాణంతో విసుగుపుట్టేది. ఈ నెల 19వ తేదీ నుంచి దశలవారీగా పునరుద్ధరించనున్న అన్ రిజర్వుడ్ ప్యాసింజర్ రైళ్ల (Trains)వేగాన్ని పెంచుతున్నట్లు ద.మ.రైల్వే గతంలో ప్రకటించింది.