ఓ శతాధిక వృద్ధుడు కొవిడ్ మహమ్మారిని జయించారు. హైదరాబాద్‌కు చెందిన రామానందతీర్థులు అనే వృద్ధుడు 18 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం ఆయన వైరస్ నుంచి బయటపడ్డారని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు బుధవారం వెల్లడించారు. తన వయస్సు 110 ఏళ్లని తెలిపారని.. అంత వయస్సున్న వ్యక్తి కరోనా నుంచి కోలుకోవడం దేశంలో ఇదే ప్రథమమని రాజారావు పేర్కొన్నారు.
‘‘కీసరగుట్ట ప్రాంతంలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న రామానందతీర్థ(110)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన ఉంటున్న కీసరగుట్ట ప్రాంతంలోని ఆశ్రమం వారు గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నప్పటికీ, ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగయ్యేవరకు ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతాం. ఆపై డిశ్ఛార్జి చేస్తాం’’ అని రాజారావు వివరించారు. రామానందతీర్థులుకు భార్యాపిల్లలు ఎవరూ లేరు. గతంలో ప్రవచనకర్తగా పనిచేశారు.
హైదరాబాద్ ముషీరాబాద్‌కు చెందిన పెంటమ్మ(90) అనే వృద్ధురాలూ కరోనాను జయించారని రాజారావు తెలిపారు. ఆమె గాంధీ ఆసుపత్రిలో ఈ నెల 7న చేరారని.. నెగెటివ్ రావడంతో బుధవారం డిశ్ఛార్జి చేశామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇంటింటి సర్వేలో వెలుగులోకి వచ్చిన కరోనా బాధితులు