Farmer Unions Leaders Kisan yatra: రైతుల ఆందోళనలకు తలొగ్గి 3 సాగు చట్టాల రద్దు సమయంలో.. కేంద్రం ఇచ్చిన హామీల జాప్యాన్ని నిరసిస్తూ కన్యాకుమారి నుంచి దిల్లీ పార్లమెంట్ వరకు రైతు సంఘాల నేతలు కిసాన్ యాత్ర చేపట్టారు. 20 మందితో కూడిన రైతు సంఘాల ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో రాష్ట్ర రైతుబంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో సమావేశమైంది. దేశంలో వ్యవసాయ రంగం, అన్నదాతల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న విధానాల గురించి పల్లా రాజేశ్వర్ రెడ్డి వారికి వివరించారు. మహోన్నత లక్ష్యంతో రైతు సంఘాలు చేపట్టిన దిల్లీ యాత్ర సఫలీకృతం కావాలని ఆయన ఆకాక్షించారు.
ఏఏ ముఖ్యమంత్రులను కలిశారంటే: ఈ నెల 2న కన్యాకుమారిలో రైతు సంఘాల యాత్ర ప్రారంభమైంది. అనంతరం కేరళ సీఎం విజయన్, చైన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో సమావేశమయ్యారు. మార్చి 3న అమరావతిలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. కేంద్రం ఇచ్చిన హామీల గురించి ముఖ్యమంత్రులకు వారు వివరించారు. యాత్రకు మద్దతు ప్రకటించిన కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు.. కనీస మద్ధతు ధరల చట్టం తేవాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు అనుకూల విధానాలపై రైతు సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు.
రైతుల బృందం డిమాండ్లు: కర్షకుల శ్రేయస్సు దృష్ట్యా కనీస మద్ధతు ధరల చట్టం అనివార్యమని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. జన్యు మార్పిడి పంటలకి అనుమతి ఇవ్వొద్దని, అన్నదాతల అంగీకారం లేకుండా భూసేకరణ జరపొద్దని, జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు మాఫీ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సాగు చట్టాల రద్దు ఉద్యమంలో నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవడం, ప్రాణాలు కోల్పోయిన బాధిత రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడం వంటి 10 డిమాండ్లను ఆ బృందం రాష్ట్రప్రభుత్వాల ముందుకు తీసుకెళ్తోంది.
యాత్ర ఎప్పటి వరకంటే: ఈ నెల 20న దిల్లీలో ముగియనున్న యాత్ర సందర్భంగా జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు రైతు నేతలు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ వెళ్లనున్న రైతు సంఘాల నేతలు.. రాయ్‌పూర్‌లో సీఎం భూపేష్‌బగేల్‌తో, అనంతరం భువనేశ్వర్‌లో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశం కానున్నారు.
"ప్రధానమంత్రి మాట ఇచ్చి విస్మరించిన హమీల అమలుపై కనీస మద్దతు ధరతో పాటు పది డిమాండ్లు ముందుకు తెస్తున్నాం. వాటిని ప్రభుత్వాలకు గుర్తు చేయాలనుకుంటున్నాం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్నాం. ఇద్దరు సీఎంలు అంగీకరించారు. రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి పనితీరు బాగుంది."-సెంథిల్ కుమార్, తమిళనాడు
ఇవీ చదవండి: