హైదరాబాద్ బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభానికి వేళైంది. ఈ నెల 6న అట్టహాసంగా ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. 2017లో మంత్రి కేటీఆర్ రూ.387 కోట్లతో తమ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఈ ఫ్లైఓవర్ పనులు.. కరోనా కారణంగా నెమ్మదిగా సాగాయి. ఫలితంగా దాదాపు నాలుగు సంవత్సరాల అనంతరం పనులన్నీ పూర్తి కావడంతో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక్కడ ట్రాఫిక్ జామ్ అంటే హడలే..
నగరంలో అతి ప్రధాన రహదారుల్లో ఒకటి బాలానగర్. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అంటే వాహనదారులు నరకంగా భావిస్తారు. కిలోమీటర్ వ్యవధిలో ఉండే ఫతేనగర్ సిగ్నల్ నుంచి బాలానగర్ సిగ్నల్ దాటాలంటే సుమారు అరగంట పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. వీటన్నింటికీ చెక్ పెడుతూ.. ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి కేటీఆర్ రూ.387 కోట్లతో 2017లో ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేయగా.. కరోనా ప్రభావం వల్ల పూర్తవడానికి సుమారు నాలుగేళ్లు పట్టింది. 1.13 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ఫ్లైఓవర్.. ఆరు లైన్లతో ఎస్ఆర్డీపీ సౌజన్యంతో హెచ్ఎండీఏ ఈ వంతెనను నిర్మించింది.
ప్రయాణికులకు ఉపశమనం..
బోయిన్పల్లి నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు సిగ్నళ్లను కలుపుతూ ఈ నిర్మాణం చేపట్టారు. అదే విధంగా జీడిమెట్ల వైపు వెళ్లేవారికి సైతం ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. గత 20 ఏళ్లుగా బాలానగర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు, ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు వచ్చినా.. ఎవరూ పట్టించుకోలేదని, తెరాస ప్రభుత్వ హయాంలోనే ఈ వంతెన నిర్మాణం జరిగిందని ఓ కార్పొరేటర్ తెలిపారు. ఇన్నిరోజులు ట్రాఫిక్‌తో సతమతమైన స్థానికులు, ప్రయాణికులు వంతెన అందుబాటులోకి వస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: CM KCR SONGS: కేసీఆర్ రాసిన సూపర్‌హిట్టు పాటలేంటో తెలుసా..?