వైద్య విద్య ఫీజుల పెంపును సవాల్ చేస్తూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న ఫీజును పూర్తిగా చెల్లించడం, ఇటీవల అదనంగా పెంచిన ఫీజులో ఏ కేటగిరీ విద్యార్థులు 50శాతం, బీ కేటగిరి విద్యార్థులు 60 శాతం చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది.
అలా చేయండం వల్ల తమపై అదనపు భారం పడుతుందని.. ఉత్తర్వులను సవరించి.. జీవో ప్రకారం మొత్తం ఫీజులో చెల్లింపు శాతాన్ని నిర్ధారించాలని విద్యార్థులు కోరారు. మళ్లీ విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఏ, బీ కేటగిరీ విద్యార్థులు మొత్తం ఫీజులో 50, 60శాతం చెల్లించాలని పేర్కొంటూ ఉత్తర్వులను సవరించింది. ఫీజుల చెల్లింపు.. తుది తీర్పునకు లోబడి ఉండాలని.. మిగతా మొత్తానికి విద్యార్థులు బాండ్ రాసివ్వాలని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్లతో పాటు.. పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులందరికీ ఈ సవరణ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'రద్దు చేయమన్నది ఒక జీవో... ప్రభుత్వం చేసింది ఇంకొకటి'