జులైలో గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లే వరద ఈ ఏడాదే అత్యధికం కానుందా? ఈ నెలలో ఇప్పటివరకు కడలిలోకి వెళ్లింది, ప్రస్తుత ప్రవాహాలను పరిగణనలోకి తీసుకొంటే ఇదే సరికొత్త రికార్డయ్యే అవకాశాలున్నాయని నీటిపారుదల శాఖ వర్గాల అంచనా. సాధారణంగా జులైలో గోదావరి నుంచి సముద్రంలోకి 100 నుంచి 500 టీఎంసీలు మాత్రమే వెళ్లేది. ఇంతకు మించి వెళ్లిన సంవత్సరాలు చాలా తక్కువ. 2013 జులైలో అత్యధికంగా 2,033.86 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లింది. కానీ, ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం ఉదయం వరకు 1,225 టీఎంసీలు ధవళేశ్వరం వద్ద నుంచి సముద్రంలోకి వెళ్లగా, బుధవారం ఉదయం ఆరుగంటలకల్లా మరో 200 టీఎంసీలు వెళ్లనున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా రోజూ వంద టీఎంసీలకు తగ్గకుండా సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే గోదావరి నుంచి జులైలో సముద్రంలోకి అత్యధికంగా నీటిని వదిలిన సంవత్సరంగా 2022 రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంది. ఇందులో మూడో వంతు నీరు ఎగువ గోదావరి, మానేరు, ప్రాణహిత ద్వారా కాళేశ్వరం వద్ద ఉన్న మేడిగడ్డ బ్యారేజీ నుంచి వదిలిందే.
* గోదావరికి జులైలో అత్యధికంగా వచ్చిన వరదను పరిగణనలోకి తీసుకొంటే 15 లక్షల క్యూసెక్కులకు మించి సముద్రంలోకి వదిలిన సంత్సరాలు 1861, 1887, 1988, 1989. ఇందులోనూ 20 లక్షల క్యూసెక్కులకు మించి జులైలో వరద వచ్చింది 1988 జులై 30న. ఆ రోజు 20.44 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు.
* 1861 నుంచి 2021 వరకు గోదావరిలో అత్యధిక వరద వచ్చింది 1986 ఆగస్టు 16న 35.06 లక్షల క్యూసెక్కులు. 2006 ఆగస్టు ఏడున కూడా 28.05 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు.
* గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లే నీటిలో కొంతైనా ఇతర బేసిన్లకు మళ్లించి వినియోగించుకోవాలనే చర్చ కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది తప్ప కార్యరూపం దాల్చడం లేదు.
ఇదీ చదవండి : ల్యాండ్ ఫోన్ కోసం మహిళ దారుణ హత్య.. ఎక్కడంటే..?