పీసీసీ ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరుకున్నప్పటికీ ప్రకటనకు మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ నేతల మధ్య సఖ్యతను కుదిర్చిన అధిష్ఠానం... ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలన్న అంశంపైనా తీవ్ర కసరత్తు చేస్తోంది. పీసీసీ అధ్యక్ష పోటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీలు ఉన్నట్లు తెలుస్తోంది.
అందరినీ కలుపుకుని పోవాల్సిందే..
ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించినా... సీనియర్ నేతలు అందరిని కలుపుకుని పార్టీకి నష్టం జరగని రీతిలో ముందుకెళ్లాల్సిందేనని అధిష్ఠానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తరచూ మీడియాతో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడిగా ఫలానా వ్యక్తి వద్దని, ఫలానా వాళ్లే కావాలంటున్న నాయకులతో కూడా అధిష్ఠానం మాట్లాడినట్లు సమాచారం.
కలిసే పనిచేస్తాం..
పీసీసీ అధ్యక్షుడి విషయంలో కొందరు నాయకులు వ్యతిరేకంగా, మరికొందరు అనుకూలంగా మాట్లాడుతున్నప్పటికీ వారంతా కూడా.... ఎవరికి ఇచ్చినా తాము కలిసి పని చేస్తామని అధిష్ఠానానికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాలు, సుదీర్ఘ చర్చల తర్వాతే సమగ్ర నివేదికను అధిష్ఠానానికి ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సరైన నాయకుడి కోసం..
తెరాస, భాజపాకు దీటుగా.... పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లే నాయకుడి కోసం అధిష్ఠానం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు.. కార్యనిర్వాహక అధ్యక్షులు, కమిటీ సభ్యుల ఎంపిక ఒకేసారి చేసేలా కసరత్తు జరుగుతోంది. అందువల్లే అధ్యక్షుడి ఎంపిక ప్రకటన ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇదీ చూడండి: త్వరలో ఎన్నికలకు కోఆర్డినేటర్లను ఎంపిక చేసిన భాజపా