హైదరాబాద్ మహానగరానికే తలమానికమైన తీగల వంతెన నెలాఖరులో ప్రారంభం కాబోతుంది. జులై 25 నాటికి పనులన్నింటినీ పూర్తి చేస్తామని, నెలాఖరులోపు ప్రారంభోత్సవం ఉండొచ్చని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. అధికారులు చైనా సంస్థతో విద్యుద్దీపాల అలంకరణ పనులకు గతే ఏడాదే ఒప్పందం కుదుర్చుకున్నారు. లాక్‌డౌన్‌కు ముందు పనులు మొదలయ్యాయి. అప్పట్నుంచి ఎలక్ట్రిక్ వస్తువుల పరికరాల దిగుమతికి సమస్యలు ఏర్పడ్డాయని, ప్రభుత్వ స్థాయిలో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ అవసరమైన వస్తువులను సమకూర్చుకుంటున్నామని అధికారులు వివరించారు.
రికార్డు సమయంలో పూర్తి.. రూ.184 కోట్లతో రెండేళ్ల క్రితం దుర్గం చెరువుపై తీగల వంతెన పనులు మొదలయ్యాయి. వంతెన నిర్మాణం రికార్డు సమయంలో పూర్తయినట్లు ఎల్‌అండ్‌టీ ఇంజినీర్లు తెలిపారు.ఒక సెగ్మెంట్ అమర్చడానికి 2 రోజులు, ఒక కేబుల్ బిగించేందుకు 28 గంటల సమయం పట్టిందని తెలిపారు. దుర్గం చెరువు వంతెన నిర్మాణంలో చాలా విజయాలు నమోదు చేశామని సంతోషం వ్యక్తం చేశారు. కేబుల్ బ్రిడ్జికి అనుసంధానంగా రోడ్డు నం.45పై రూ.84.87 కోట్లతో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం సైతం శరవేగంగా పూర్తయింది. రెండింటినీ నెలాఖరులోపు ప్రారంభిస్తామని ప్రాజెక్టుల విభాగం స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- 'కరోనా వేళ ఎన్నికల నిర్వహణకు సూచనలు ఇవ్వండి'