లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో రాష్ట్రంలో వలస కూలీలు, కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోవాలన్న గట్టి తలంపుతో పరిపరి విధాలుగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. మార్గమధ్యంలో ఎవరైనా అంతో ఇంతో పెడ్తే తింటూ మళ్లీ ప్రయాణం సాగిస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకొని వెనక్కు పంపుతుంటే కొందరు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రిపూట అయితే తక్కువ సమస్యలతో బయట పడొచ్చనేది మరికొందరి ఆలోచనగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని బాలాపూర్‌కు చెందిన 17 కుటుంబాలు బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరాయి. ‘ఎలాగైనా ఊరెళ్లడం ఇప్పుడు ముఖ్యం, మధ్యలో ఏమైనా ట్రక్‌లు దొరుకుతాయేమో’నని నడుస్తూ వెళ్తున్నామని ఇద్దరు పిల్లలతో వెళ్తున్న ఆశీష్‌ప్రసాద్ ఆశాభావంతో వ్యక్తం చేశారు.
ఒడిశాకు చెందిన వల అనే వ్యక్తి మరో నలుగురితో కలిసి మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి కాలిబాటన బయలుదేరారు. గురువారం ఖమ్మం జిల్లా ఏస్కూరులో సేదతీరుతూ ‘మరో 300 కిలోమీటర్లు నడిస్తే మా ఊరొస్తుందని అతను చెప్పారు. దారి పొడువునా దాతలు పెడుతున్న భోజనం చేస్తున్నామని, ఎక్కడా వాహనాలు దొరకడం లేదని చెప్పారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో వలస కూలీలు తమ ప్రాంతానికి వెళ్లిపోయారు. ఈ రెండు జిల్లాలలోనే 60 వేల మంది వలస కూలీలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ‘‘మాకు ఇక్కడ పనుల్లేవు. దాబాలో పనిచేసే మేం పది రోజులుగా పనుల్లేక ఖాళీగా ఉన్నాం. చేతిలో పైసలు, ప్రభుత్వం ఇచ్చిన 12 కిలోల బియ్యం, నగదు కూడా అయిపోయాయి. అందుకే మా రాష్ట్రం ఒడిశాకు నడిచిపోతున్నామని కొందరు చెప్తున్నారు. పోలీసులు అడ్డుకుని పోనివ్వడం లేదు. మాకు తిండైనా పెట్టండి. లేదా మా రాష్ట్రంలో వదలండి’’ అంటూ హైదరాబాద్- విజయవాడ నకిరేకల్ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న జాదవ్, సహచర కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. వలసజీవులు సాగిస్తున్న కష్టాల పయనంలో మచ్చుకు కొన్ని దృష్యాలివి.
వలస కూలీల సంక్షేమానికి హెల్ప్ డెస్క్
వివిధ ప్రాంతాల వలస కార్మికులు లాక్‌డౌన్‌తో ఇక్కడ పనుల్లేక చిక్కుకుపోయారు. సొంత ప్రాంతాలకు వెళ్లలేక, ఉండేందుకు వసతి లేక, వేతన చెల్లింపుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు కార్మిక శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి హెల్ప్ డెస్క్‌ను గురువారం ప్రారంభించారు. సమస్యలను 94925 55379 నంబరుకు వాట్సాప్ చేయవచ్చు. లేదా covid19colts@gmail.com కు పంపవచ్చు అధికారులు చెప్తున్నారు.
వీరేమీ సైక్లింగ్ పోటీకి దిగిన వారు కాదు. అలాగని ఏదో ఒక సందేశంతో చేస్తున్న దేశ పర్యటన అంతకంటే కాదు. వీరంతా రాజధానిలో భవన నిర్మాణ పనుల కోసమని అలహాబాద్ నుంచి వచ్చారు. లాక్‌డౌన్‌తో పనులు లేక పాట్లు పడటం కంటే ఏదోలా తమ ఊరెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు. రోజూ పని ప్రదేశానికి వెళ్లేందుకు ఉపయోగించే సైకిళ్లతోనే దాదాపు 1200 కిలోమీటర్ల ప్రయాణం ప్రారంభించారు. బుధవారం ప్రారంభమైన వీరి ప్రయాణం గురువారానికి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండకు చేరుకుంది. 200 కిలోమీటర్లు వచ్చామని మరో వెయ్యి కిలోమీటర్లు వెళ్లాల్సి ఉందని తెలిపారు.
హైదరాబాద్‌లో రాడ్‌బెండింగ్ పనులు చేసే వీరు మూడు రోజుల క్రితం ఒడిశాలోని సొంత ప్రాంతానికి కాలినడకన బయలు దేరి గురువారానికి ఖమ్మం జిల్లా ఏస్కూరు చేరుకున్నారు.
వీరంతా హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతంలోని భవన నిర్మాణ కార్మికులు. పనుల్లేకపోవడంతో బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని సొంతూరుకి కాలినడకన బయల్దేరారు.
ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!