రైతు సంఘాల సంఘర్షణ సమితి పిలుపు మేరకు ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు, జన సమితి పార్టీలతో కలిసి రహదారుల దిగ్బంధంలో అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
వామపక్షాలు, జన సమితితో కలిసి తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేపట్టాలని, జిల్లా కేంద్రాల్లో సభలు, ర్యాలీలు నిర్వహించాలని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు చేస్తున్న ఆందోళన 71 వ రోజు చేరుకుందని గుర్తుచేశారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు ఆందోళనలు, నిరసన దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను, మద్దతు ధరలను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఇదీ చూడండి: 'సినీనటికి వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు'