కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు (Congress Leaders) ధ్వజమెత్తారు. దేశభద్రతకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు ముప్పు తెస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద పెగాసిస్ (Pegasis) ఫోన్ ట్యాప్‌లను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చలో రాజ్‌భవన్ (Chalo Rajbhavan)కు పిలుపునిచ్చింది. మొదటగా ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే సీతక్క, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి, ఫిరోజ్ ఖాన్, డీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఖూనీ చేస్తున్నారు...
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ గీతారెడ్డి అన్నారు. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్న ఆమె... ప్రతిపక్షాల నోర్లు నొక్కేస్తోందని ఆరోపించారు. స్వేచ్ఛ లేని నిఘా రాజ్యం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఫోన్ల ట్యాపింగ్‌పై సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌కు చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
భయంతోనే...
భాజపా పాలనలో అనేక మంది కవులు, మేధావులు చంపబడ్డారని కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ఫోన్లను పెగాసిస్ సంస్థ తన కంట్రోల్‌లోకి తీసుకుందని ప్రైవసీ యాక్ట్ ప్రకారం ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని స్పష్టం చేశారు. భయంతోనే ప్రధాని మోదీ... ప్రతిపక్షాలు, జడ్జిలు, మీడియా ఫోన్‌లను ట్యాప్ చేస్తున్నారని తెలిపారు. దేశంలో రాష్ట్రంలోనూ నియంతృత్వ పాలన సాగుతోందని పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. తెలంగాణ నిఘా విభాగం కూడా తమ ఫోన్‌లను ట్యాప్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ ముట్టడి చేపడతాం...
గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తామన్నా పోలీసులు అరెస్టు చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ఎదుర్కోలేకే ఫోన్ల ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ పోలీసులను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. రాజ్‌భవన్ ముట్టడి కాదు... గవర్నర్ ముట్టడి చేపడతామని జగ్గారెడ్డి హెచ్చరించారు.
అరెస్టులు...
చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా ధర్నా చౌక్ నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజ్ భవన్‌కు పరుగులు తీస్తుండగా అప్పటికే బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆ సమయంలో పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట చోటు చేసుకుంది.
కాంగ్రెస్ అగ్ర నాయకులు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, నూతి శ్రీకాంత్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈరోజు ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింది. ఇజ్రాయిల్ దేశానికి సంబంధించిన పెగాసిస్ అనే స్పైవేర్‌ను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలు, న్యాయాధీశులు, ఎలక్షన్ అధికారులు ప్రజా సంఘాల నాయకుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసి వారు లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలను లేకుండా చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేయటమే. నిరసనలు తెలియజేయడమనేది ప్రజాస్వామ్యంలో ప్రధాన భూమిక. అదే నిరసనలను కాంగ్రెస్ పార్టీ ప్రశాంతంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటే ప్రతి జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి వాళ్లను బయటకు రాకుండా చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.
-- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇదీ చూడండి: Telangana Rains: ప్రజలెవ్వరూ ఇళ్లలో నుంచి బయటకురావద్దు: సీఎం కేసీఆర్