తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా పల్లెప్రగతిని అమలు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కేంద్రం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కారాలు పొందిన మెదక్ జడ్పీ ఛైర్పర్సన్, ఎంపీపీలు, వివిధ గ్రామపంచాయతీల సర్పంచ్లతో మంత్రి హైదరాబాద్లో ఆత్మీయ సమావేశం నిర్వహించి... వారిని సన్మానించారు.
సీఎం కేసీఆర్ సమున్నత ఆశయాలకు అనుగుణంగా అమలవుతోన్న పల్లెప్రగతి కార్యక్రమమే రాష్ట్రానికి అవార్డులను తీసుకొచ్చిందని మంత్రి అన్నారు. పథకాలను అమలు చేస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరి కష్ట ఫలితమే ఈ అవార్డులన్న ఆయన... గ్రామాల స్వరూపాన్ని సమగ్రంగా మార్చిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం అమలు చేయాలని కోరారు.
అవార్డులు ఇస్తున్న కేంద్రం మరింతగా ఆర్థికసాయం చేసి ప్రోత్సహించాల్సింది పోయి... నిధుల్లో కోత పెట్టడం ఎంత వరకు సబబని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు అవసరమైతే దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి మరిన్ని నిధులు కావాలని అడుగుతామని చెప్పారు. కరోనా విస్తృతి నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి సూచించారు.
ఇదీ చదవండి: యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్న సంప్రదాయ కంబళ క్రీడ