ఏపీలోని నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నియామకాన్ని ఆరాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. ఈవోను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. హిందూ మతం, శ్రీవైష్ణవ తత్వం వ్యాప్తికి అహోబిలం మఠం ఏర్పాటు చేశారని గుర్తుచేసింది. మఠంలో భాగమైన దేవాలయానికి ఈవోను నియమించడం అధికరణ 26Dని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈవో నియమాకం జీయర్లు, మఠాధిపతుల పరిపాలన సంబంధ విధులపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. 2020 డిసెంబర్ 30న దేవాదాయ కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. దేవస్థానానికి చెందిన సంప్రదాయ పరిపాలన, బ్యాంక్ ఖాతాల నిర్వహణ కార్యకలాపాల్లో ఈవో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. బ్యాంక్ ఖాతాలను నిర్వహించుకునే అధికారాన్ని జీయర్‌కు పునరుద్ధరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ DVSS సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది.
అహోబిలం దేవస్థానానికి ఈవోను నియమించడాన్ని సవాలు చేస్తూ కేబీ సేతురామన్, అహోబిలం మఠాధిపతి తరఫున సంపత్ సడగోపన్ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సీఆర్ శ్రీధరన్, డబ్ల్యూబీ శ్రీనివాస్ వాదనలు వినిపించారు. దేవస్థానం అహోబిలం మఠంలో అంతర్భాగమని,ఈవోను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. మఠం వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధమని తెలిపారు. దేవస్థానం పరిపాలన వ్యవహారాలు సక్రమంగా జరిగే విధంగా చూసేందుకు ఈవోను నియమించామని ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఏ దేవస్థానమైనా ఆయా రాష్ట్ర పరిధిలోని దేవాదాయ చట్టం నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సిందేనన్నారు. గతంలోనే ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం రిజర్వు చేసిన తీర్పును తాజాగా వెల్లడించింది.
ఇవీ చదవండి
పాల ట్యాంకర్, బస్సు మధ్య నలిగి 9 మంది మృతి.. అందరిదీ ఒకే ఫ్యామిలీ!
తారాస్థాయికి మునుగోడు ఉపఎన్నిక పోరు.. గెలుపే లక్ష్యంగా పార్టీల మాస్టర్ ప్లాన్స్