పదో తరగతి వార్షిక పరీక్షలు ఈసారి ఆరు రోజుల పాటు వరుసగా జరగనున్నాయి. మధ్యలో ఒక్కరోజు కూడా వ్యవధి లేదు. కరోనా పరిస్థితుల కారణంగా 11కు బదులు ఈసారి ఆరు పరీక్షలే జరుపుతున్నారు. ప్రధాన సబ్జెక్టులు మే 17న(సోమవారం) ప్రారంభమై 22న(శనివారం) పూర్తవుతాయి. ఆ తర్వాత తక్కువ మంది హాజరయ్యే ఓరియంటల్, ఒకేషనల్ సబ్జెక్టుల పరీక్షలు మూడు రోజులపాటు జరుగుతాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్‌ఎస్‌సీ బోర్డు) మంగళవారం పరీక్షల కాలపట్టికను ప్రకటించింది.
పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు.. అంటే 3.15 గంటలపాటు జరుగుతాయి. ఒక్కో సబ్జెక్టుకు ఒకే పరీక్ష కావడంతో ఈసారి అరగంట సమయం పెంచారు. ఆబ్జెక్టివ్ పేపర్(పార్ట్-బి) చివరి అరగంటలో రాయాలి. ప్రశ్నపత్రాల నమూనా, ఛాయిస్‌ల వివరాలను ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని బోర్డు సంచాలకుడు సత్యనారాయణరెడ్డి తెలిపారు. పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా రూ.125 ఈనెల 25 తేదీ వరకు ప్రధానోపాధ్యాయుల ద్వారా చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుంతో మార్చి 3, రూ.200తో మార్చి 10, రూ.500 ఆలస్య రుసుముతో మార్చి 16వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం ఉంది.