భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో నల్గొండలో ఉత్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని బండి సంజయ్(Bandi sanjay in nalgonda) సందర్శిస్తుండగా... తెరాస కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ తెరాస శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. తెరాస శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. తెరాస శ్రేణులపైకి దూసుకెళ్లేందుకు భాజపా కార్యకర్తలు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. 'పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నార'ని భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఐకేపీ కేంద్రంలో తెరాస, భాజపా శ్రేణులు(trs vs bjp) పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. ఈ ఉద్రిక్తతల మధ్యే ఐకేపీ కేంద్రంలోని ధాన్యం రాశులను బండి సంజయ్ పరిశీలిస్తున్నారు.
బలగాల మోహరింపు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో... సంజయ్ రాకకు ముందే ఐకేపీ కేంద్రాన్ని తెరాస(trs news) ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లపై రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు పేరుతో భాజపా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వర్షకాలం సీజన్ లో పండి ప్రతిధాన్యపు గింజను రాష్ట్రప్రభుత్వమే కొనుగోలుచేస్తుందని... యాసంగి ధాన్యం కొంటామని కేంద్రప్రభుత్వం హామీ ఇస్తుందా? అని బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. భూపాల్ వెంట ఆయన అనుచరులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో ఐకేసీ సెంటర్‌కు భాజపా, తెరాస శ్రేణులు భారీగా చేరుకున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇరువర్గాలు ఒక్కచోట పోగవుతున్న దృష్ట్యా ఎప్పుడు ఏం జరుగుతుందోనని భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా ఎస్పీ రంగనాథ్ అక్కడకు చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శెట్టిపాలెంలోనూ ఉద్రిక్తత
మరోవైపు బండి సంజయ్ రాకకు ముందే వేములపల్లి మండలం శెట్టిపాలెంలోని రైస్ మిల్లు వద్దకు తెరాస నేతలు తరలివచ్చారు. సంజయ్ పర్యటనను అడ్డుకోవడానికి ఎమ్మెల్యే భాస్కరరావు ఆయన అనుచరులతో చేరుకున్నారు. కొందరు భాజపా కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో పోటాపోటీ నినాదాలతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బండి సంజయ్ పర్యటన పేరుతో రైతులను అయోమయంలో పడేయవద్దని ఎమ్మెల్యే అన్నారు. యాసంగిలో దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్ర పెద్దలతో మాట్లాడి అనుమతి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతులను మభ్యపెడుతూ ప్రలోభాలకు గురి చేయడం మంచిది కాదని అన్నారు. కేంద్రంతో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు తీసుకురావాలని సందర్భంగా కోరారు.
బండి పర్యటన ఎందుకు?
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం, రాష్ట్రం మధ్య నెలకొన్న అస్పష్ట వాతావరణం నడుమ... నేరుగా రైతుల కష్టాలు తెలుసుకునేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) చేపట్టిన పర్యటన సాగర్ ఆయకట్టు పరిధిలో కొనసాగనుంది. తొలిరోజైన ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రం నుంచి మొదలై... సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వరకు కొనసాగనుంది. సాగర్ ఎడమ కాల్వ కింద నల్గొండ, మిర్యాలగూడ, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్, కోదాడ వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో... భారీగా పంట సాగవుతుంటుంది. కానీ కొన్ని సీజన్ల నుంచి ధాన్యానికి మద్దతు ధర దక్కడం లేదు. అయితే వచ్చే యాసంగి నుంచి ధాన్యం కొనుగోళ్లు ఉంటాయా, ఉండవా అన్న మీమాంస నడుమ... భాజపా, తెరాస మధ్య నెలకొన్న మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలకు దిగుతూ... కొనుగోలు బాధ్యత మీదంటే మీదంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో... రైతులు అవస్థలు పడుతున్న ప్రాంతాల్లోనే సంజయ్ (state bjp president) పర్యటన సాగబోతోంది. ఇందుకోసం ఆ పార్టీ శ్రేణులు... అధ్యక్షుడి రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: bandi sanjay: ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్ పర్యటన.. ఆ ప్రాంతాలపైనే దృష్టి