CPI Chalo Raj Bhavan: సీపీఐ చేపట్టిన ఛలో రాజ్‌భవన్ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరిన సీపీఐ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా.. గవర్నర్‌లను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఇబ్బందులకు గురిచేస్తుందని.. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆ పార్టీ రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.
ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సీపీఐ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. పార్టీ నేతలు కూనంనేని, చాడ, అజీజ్‌పాష సహా సీపీఐ శ్రేణులు ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు.. ముందుగానే బారీకేట్లు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరిన సీపీఐ నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవటంతో తోపులాట జరిగింది.
దీంతో ఆందోళనకారులను బలవంతంగా ప్రత్యేక వాహనాల్లో ఎక్కించి.. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం గవర్నర్లను అడ్డుపెట్టుకుందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను రద్దుచేసే వరకు పోరాటం సాగిస్తామని కూనంనేని తెలిపారు.
"గవర్నర్ వ్యవస్థ అనేది బ్రిటీష్ వారు మన మీదకు వదలిపెట్టిన అవశేషం.. ఇది ఒక అపెండిక్స్ లాంటింది. ప్రజాస్వాయ్యంలో గవర్నర్ వ్యవస్థ అనేది ఒక పెద్ద గ్రహణం. ఈ వ్యవస్థ ఉన్నంతకాలం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక గవర్నర్ వ్యవస్థ, ఈడీ, సీబీఐ, ఎన్నికలు వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను రద్దుచేసే వరకు సీపీఐ పోరాటం కొనసాగుతుంది".- కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి:
- దర్యాప్తును కోర్టులు నిరోధించరాదు : సిట్ తరఫున లాయర్ దుష్యంత్ దవే
- ఈ నెల 11న ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం నమోదు చేస్తాం: సీబీఐ
- ఈనెలలో.. యాదాద్రి క్షేత్రానికి రాష్ట్రపతి రాక!